కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

By Sumanth KanukulaFirst Published May 25, 2022, 6:26 PM IST
Highlights

కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. నేడు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.  

కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. నేడు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మొత్తంగా యాసిన్‌కు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు, 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో కూడిన ఐదు శిక్షలను కోర్టు కోర్టు విధించిందని రిపోర్ట్స్‌ను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. వీటితో పాటు రూ. 10 లక్షల జరిమానా విధించినట్టుగా కూడా నివేదికలు పేర్కొన్నాయి.

ఇక, యాసిక్ మాలిక్.. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది.మాలిక్.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 124-ఏ (దేశద్రోహం) కింద అభియోగాలను ఎదుర్కొన్నాడు. మే 10 న మాలిక్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను ఎలాంటి ఆరోపణలను సవాలు చేయబోనని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. మే 25న శిక్ష ఖరారు చేయనున్నట్టుగా పేర్కొంది. యాసిన్‌ మాలిక్‌ ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదిక సమర్పించాలని ఎన్‌ఐఏ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత జరిమానాపై నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది.

అయితే ఈ క్రమంలోనే యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానాన్ని ఎన్‌ఐఏ కోరింది. యాసిన్‌ మాలిక్‌ తరుఫున వాదించేందుకు న్యాయస్థానం నియమించిన అమికస్ క్యూరీ అతడికి జీవిత ఖైదు విధించాలని సూచించింది. దీంతో ఈ రోజు ఉదయం కోర్టు తన ఉత్తర్వులను మధ్యాహ్నం 3.30 గంటలకు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే సాయంత్రం యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు చేసింది. మరోవైపు యాసిన్ మాలిక్‌కు శిక్ష ఖరారు కావడంతో బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

click me!