
బెంగళూరు: కర్ణాటకలో రెండు పెంపుడు పిల్లలు ఆ కుటుంబ సభ్యులను కాపాడాయి. ఇంట్లోకి పాము దూరి కిచెన్‌లోకి వెళ్లడాన్ని ఆ పిల్లలు గమనించాయి. ఆ తర్వాత కాసేపటికి ఇంటికి యజమాని సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. వారు రాగానే ఆ పిల్లలు మ్యావ్.. మ్యావ్ అంటూ వారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ, తొలుత ఆ పిల్లులు ఏం సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తున్నాయో యజమానికి అర్థం కాలేదు. కానీ, కిచెన్‌లోకి వెళ్లిన తర్వాత ఆ పిల్లులు పామును బయటకు రప్పించడంతో విషయం అర్థమైంది. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లా నార్గుండ్‌లో బుధవారం చోటుచేసుకుంది.
నార్గుండ్‌లో అంబేద్కర్ నగర్‌లో లక్ష్మణ్ చలవాడి కుటుంబం నివసిస్తున్నది. ఆరు బుధవారం ఓ కార్యక్రమం కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఈ రెండు కవల పిల్లులే ఉన్నాయి. లక్ష్మణ్ కుటుంబం బయటకు వెళ్లిన తర్వాత ఓ పాము ఇంటిలోకి చొరబడింది. అది మెల్లగా కిచెన్‌లోకి వెళ్లి దాక్కుంది.
Also Read: కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సేవలు.. ఆడవారి అవతారమెత్తుతున్న పురుషులు
కొంత సేపటికి లక్ష్మణ్ కుటుంబం తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీయగానే రెండు పిల్లులు అలర్ట్ చేశాయి. అవి ఎందుకు అరుస్తున్నాయో వారికి అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి వారు కిచెన్‌లోకి వెళ్లారు. అప్పుడు పిల్లులు వారి కంటే ముందు కిచెన్‌లోకి పరుగెత్తి మ్యావ్.. మ్యావ్ అంటూ గట్టిగా అరిచాయి. దీంతో ఆ పాము భయంతో బయటకు వచ్చింది. ఎదురుగా ఆ కుటుంబమంతా ఉన్నది. ఆ పామును చూసిన లక్ష్మణ్ కుటుంబానికి ఆ పెంపుడు పిల్లులు ఎందుకు అరుస్తున్నాయో అర్థం అయింది.
వారు వెంటనే పామును రెస్క్యూ చేసే వారికి కాల్ చేశారు. వెంటనే స్నేక్ క్యాచర్ బీఆర్ సురేబాన్ అక్కడికి వచ్చారు. ఆ పామును అక్కడి నుంచి కాపాడి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఈ రెండు పిల్లులు తమ ప్రాణాలను కాపాడాయని లక్ష్మణ్ సగర్వంగా చెప్పాడు.