
Uttara Kannada students protest: కర్నాటకలో విద్యార్థులు, స్థానికులు వినూత్న నిరసనకు దిగారు. అలాగే, తమ రక్తంతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాసి పంపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కోరుతూ కర్ణాటక విద్యార్థులు, స్థానికులు రక్తంతో ప్రధానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక విద్యార్థులు, స్థానికులు ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం రక్తంతో లేఖ రాశారు. కార్వార్ నగరంలోని మహాత్మాగాంధీ రోడ్డులో విద్యార్థులు గుమిగూడి తమ రక్తంలో లేఖ రాసి నిరసన చేపట్టారు. వారు “నమగే బేకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” (మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి) అని రాసి దానిని ప్రధాని నరేంద్ర మోడీకి పంపారు. వెంటనే ఆసుపత్రిని మంజూరు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కువ భౌగోళిక విస్తీర్ణం ఉన్నప్పటికీ ఒక్క మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు ప్రజలకు అందడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు.
అత్యవసర వైద్యం కోసం ప్రజలు గోవా, హుబ్బళ్లి, ఉడిపి, మంగళూరు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. జులై 20న జిల్లాలోని హొన్నావర్‌కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి డిమాండ్ పెరిగింది. తమ డిమాండ్ నెరవేరే వరకు మోదీకి రక్తంతో లేఖలు రాస్తూనే ఉంటామని ఆందోళనకారులు తెలిపారు. జిల్లాను అధికార బీజేపీకి కంచుకోటగా భావించి ఆ పార్టీ హామీలు ఇస్తున్నా ఆసుపత్రి డిమాండ్‌ను నెరవేర్చలేదు. ఆసుపత్రి నిర్మాణంలో అధికార పార్టీ విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇదిలావుండగా, దేశంలో నిత్యావసరాల ధరలు గత కొంత కాలంగా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతూ.. మరింతగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం గురించి ఓ చిన్నారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది.
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా చిబ్రమౌ కి చెందిన కృతి దూబే అనే ఆరేళ్ల చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. అయితే... ఆ చిన్నారి ఇటీవల రెండు, మూడు సార్లు స్కూల్లో పెన్సిల్ పొగొట్టుకుంది. అయితే.. పెన్సిల్...పోగొట్టుకుందని వాళ్ల అమ్మ తిట్టిందట. దీంతో... పేపర్, పెన్సిల్ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. ‘మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా?’ అని ప్రశ్నిస్తూ హిందీలో ఓ లేఖ రాసేసింది.