కర్ణాటక ఎమ్మెల్యే అనర్హత వేటుపై నెలరోజుల స్టే.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు హైకోర్టు అవకాశం

By Mahesh KFirst Published Mar 31, 2023, 12:45 PM IST
Highlights

ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించాడని జేడీఎస్ ఎమ్మెల్యేపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని, సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేయడానికి అవకాశమివ్వాలని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది కోరాడు. దీంతో అనర్హత వేటును నెల రోజులు రద్దు చేసి పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు అవకాశం ఇచ్చింది.
 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే తుమకూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డీసీ గౌరీశంకర్ స్వామిపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ.. తప్పుడు పనులు చేసి ఓటర్లను ప్రలోభపెట్టారనే కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ శాసన సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయితే, ఈ అనర్హత వేటునూ ఒక నెలరోజుల పాటు రద్దు చేసి ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

తుమకూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డీసీ గౌరీశంకర్ స్వామిపై గత ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి బీ సురేశ్ గౌడా ఈ పిటిషన్ వేశారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గౌరీశంకర్ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడని ఆరోపించారు. గౌరీశంకర్ స్వామి, ఆయన అనుచరులు కలిసి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 32 వేల వయోజనులకు, 16వేల మైనర్లకు నకిలీ ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేశారని, సెక్షన్ 123ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ ముందు ఫిబ్రవరి 17న వాదనలు ముగిశాయి. హైకోర్టు కాలబురగి బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే గౌరీశంకర్ స్వామిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 101 సెక్షన్ కింద అనర్హత వేటు వేసింది. 

Also Read: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రెండో రోజుకు కాంగ్రెస్ నిరసనలు.. టాప్ పాయింట్స్

ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి సెక్షన్ 116(బీ) కింద ఆదేశాలను రద్దు చేయాలని స్వామి తరఫు న్యాయవాది కోరారు. కర్ణాటక ఎన్నికలు ఇప్పటికే ప్రకటించిన తరుణంలో ఆదేశాలు రద్దు చేసి ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో స్వామి పోటీ చేయాలని భావిస్తున్నాడనీ తెలిపారు. ఈ విజ్ఞప్తిని గౌడా న్యాయవాది వ్యతిరేకించినా హైకోర్టు అనుమతించింది. ఆదేశాలను రద్దు చేస్తూ ఎమ్మెల్యే స్వామి సుప్రీంకోర్టు ఆశ్రయించడానికి అవకాశం కల్పించింది.

click me!