
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్నాటకలో ఇప్పటికే పలు విద్యాసంస్థల వద్ద హిజాబ్ తీసివేయాలని యాజమాన్యాల నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిజాబ్ వివాదం కారణంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎప్ఐఆర్ (FIR) నమోదైంది.
వివరాల్లోకెళ్తే.. కర్నాటక హైకోర్టు ప్రత్యేక బెంచ్ హిజాబ్ వివాదానికి సంబంధించిన కేసు విచారణ కొనసాగిస్తున్నది. అయినప్పటికీ... ఇంకా రాష్ట్రంలో ఈ అంశంపై వివాదం మరింతగా ముదురుతోంది. విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. అయితే, హిజాబ్ లను తీసివేసిన తర్వాత విద్యా సంస్థల ప్రాంగణంలోకి అనుమతిస్తామని చెప్పడంతో కళాశాల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విద్యార్థులపై కేసు నమోదైంది. తుమకూరు జిల్లాలో శుక్రవారం నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
హిజాబ్ ధరించడంపై తుమకూరులోని ఎంప్రెస్ కళాశాల (Empress College) ఆంక్షలు విధించింది. అయితే, గత రెండు రోజులుగా నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు 15 నుండి 20 మంది విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్ తుమకూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు తమ హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన తన ఫిర్యాదులో ఏ విద్యార్థి పేరును కూడా ప్రస్తావించలేదు.
హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ డిమాండ్ చేస్తూ.. నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన మొదటి ఎఫ్‌ఐఆర్ ఇది. ఇకపై విద్యార్థుల పట్ల మెతక వైఖరి ఉండబోదని, మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర గతంలోనే ప్రకటించారు. ఇదిలావుండగా, మరో సంఘటనలో.. విజయపుర జిల్లాలోని ఇండి కాలేజీ (Indi College) ప్రిన్సిపాల్ 'సిందూర్' (వెర్మిలియన్) ధరించినందుకు హిందూ విద్యార్థిని వెనక్కి పంపారు. ఆమెను గేటు వద్ద ఆపి, మతపరమైన చిహ్నాలను అనుమతించనందున సిందూర్‌ను తొలగించాలని కోరారు. బంధువులు పాఠశాల ప్రాంగణానికి వచ్చి పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించారు. శ్రీరామ్‌సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బెళగావి జిల్లాలోని ఖానాపురాలోని నంద్‌ఘడ్ కళాశాల (Nandhghad College) లో ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ దుప్పట్లతో తరగతులకు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థులను ప్రవేశం నిరాకరించి వెనక్కి పంపారు. మరోవైపు కూర్గ్ జిల్లాలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిజాబ్ వివాదం నేపథ్యం ఇది..
కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ విద్యా సంస్థలో ఈ వివాదం రాజుకుంది. ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత కొన్ని వారాల క్రితం రాష్ట్రంలో హిజాబ్ అంశం ఉద్రిక్తలకు దారితీసింది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన కళాశాలలు, పాఠశాలల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని నిబంధనను జారీ చేసింది. ప్రస్తుతం హిజాబ్ వ్యవహారాన్ని కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.