
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో (Karnataka High Court) విచారణ కొనసాగుతుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ (Justice Ritu Raj Awasthi) నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా చోటుచేసుకునే మౌఖిక పరిశీలనలను నివేదించవద్దని మీడియాను ధర్మాసనం కోరింది. తుది ఉత్తర్వుల కోసం వేచిచూడాలని తెలిపింది. విచారణ సందర్భంగా చేసే కామెంట్లను సోషల్ మీడియాలో కూడా పెట్టవద్దని పేర్కొంది.
ఇక, ఈ విచారణ సందర్భంగా పిటిషన్ల తరఫున సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. కర్ణాటక విద్యా చట్టంలో యూనిఫామ్‌పై ప్రత్యేక నిబంధనలేవీ లేవని తెలిపారు. మునుపటి రోజుల్లో యూనిఫామ్ అనేది పాఠశాలలో ఎక్కువగా ఉండేదని.. కాలేజ్‌లకు యూనిఫామ్ చాలా కాలం తరువాత వచ్చాయని అన్నారు. తాను యూనివర్శిటీలో చదివే రోజులలో యూనిఫామ్ లేదని చెప్పారు. అయితే కోర్టు మౌఖిక పరిశీలనను రిపోర్ట్ చేయకూడదని పేర్కొన్న నేపథ్యంలో.. హైకోర్టు విస్తృత ధర్మాసం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో.. తుది ఉత్తర్వుల వచ్చేవరకు వేచిచేయాల్సిందే.
ఇక, హిజాబ్ వివాదంపై హైకోర్టు విచారణ నేపథ్యంలో.. ఎవరూ కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని రాజకీయ నాయకులతో పాటుగా ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కోరారు. విద్యార్థుల పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర గురువారం తెలిపారు.