నేడే బలపరీక్ష: ఆస్పత్రిలో చేరిన కుమారస్వామి, నాటకమేనంటున్న బీజేపీ

By Siva KodatiFirst Published Jul 22, 2019, 7:45 AM IST
Highlights

ముఖ్యమంత్రి కుమారస్వామి ఆస్పత్రిలో చేరడంతో కన్నడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. ఇవాళ బలపరీక్ష ఉండటంతో సీఎం కావాలనే ఇలా చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చిత్ర, విచిత్ర మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయంలో మరో ఊహించని పరిణామాం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు.

హైబీపీ తదితర కారణాలతో సీఎం బెంగళూరులోని అపోలో హాస్పటిల్‌లో చేరారు. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది. బలపరీక్షలో ఓడిపోతారనే భయంతోనే ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ నేతలు.  

విశ్వాస పరీక్షను మరింత ఆలస్యం చేసేందుకే కాంగ్రెస్-జేడీఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం ఓ గంటపాటు అసెంబ్లీలో ఉంటే చాలని.. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లొచ్చని సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు సోమవారం కుమారస్వామి సర్కార్‌కు బలపరీక్ష నిర్వహించనున్నారు స్పీకర్ సురేశ్ కుమార్. తన ఆదేశాలను స్పీకర్ పట్టించుకోకపోవడంతో... ఒకవేళ సోమవారం బలపరీక్ష జరపకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ వాజుభాయ్ వాలా దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకునేందుకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి మంతనాలు జరిపారు.

సంకీర్ణ సర్కార్‌ను కాపాడుకోవడానికి చివరి అస్త్రంగా ‘‘ సీఎం పదవి నుంచి కుమారస్వామి వైదొలుగుతారని.... కాంగ్రెస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫర్వాలేదని సంకేతాన్ని వీరిద్దరు పంపారు. మరి సోమవారం కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతోందోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 
 

click me!