
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. హవేరీ-హనగల్ మెయిన్ రోడ్డులోని అలడకట్టి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం కారణంగా ముగ్గురు సజీవ దహనమయ్యారు.అయితే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రమాదం నుండి బయటపడ్డాడు. మంటల నుండి తప్పించుకొనేందుకు ఆ వ్యక్తి మంటలు చెలరేగిన భవనం మూడో అంతస్తు నుండి కిందకు దూకాడు. అయితే ఆయన స్పృహ కోల్పోయాడు. అతడిని దావణగెరె జిల్లా హరిహరకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టుగా హవేరీ ఎస్పీ డాక్టర్ శివకుమార్ చెప్పారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
వినాయక చవితి, దసరా, దీపావళిని పురస్కరించుకొని గోడౌన్ లో నిల్వ ఉంచిన టపాకాయలు పేలినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే టపాకాయలు పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మృతులను ద్యామప్ప ఒలేకర్, శివలింగ అక్కి, రమేష్ బారిక్ లుగా గుర్తించారు. ఈ గోడౌన్ లో ఉన్న బాణసంచా పేలుడుతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. బాణసంచా కారణంగా మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. సుమారు నాలుగు గంటల తర్వాత మంటలను ఫైర్ ఫైటర్లు అదుపు చేశాయి.
ఈ భవనానికి సమీపంలో వెల్డింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వెల్డింగ్ పనులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే అనుమానాన్ని అగ్నిమాపక సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా నిల్వ చేసే గోడౌన్లలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.