రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: మాజీ సీఎం కుమార స్వామి సంచలన నిర్ణయం

By Nagaraju penumalaFirst Published Aug 3, 2019, 9:05 PM IST
Highlights

ఇకపోతే తాను ప్రశాంతత కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా తాను పని చేసినంత కాలం ప్రజలకు మంచే చేశానని చెప్పుకొచ్చారు. 

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.  అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అనుకోకుండానే సీఎంను అయ్యానని కుమార స్వామి చెప్పుకొచ్చారు.  

మాజీ సీఎం కుమార స్వామి వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భగవంతుడు కల్పించాడని దానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. 

ఎవరినో సంతృప్తిపరిచేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సీఎంగా పనిచేసిన 14నెలలు ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేసినట్లు తెలిపారు. తన 14 నెలల పాలనపై సంతృప్తి చెందుతున్నట్లు ప్రకటించారు. 

ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాక్యలు చేశారు కుమార స్వామి. రాజకీయాలు ఎటువైపు పోతున్నాయో తాను గమనిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలు కుల సమీకరణాలతో కూడుకున్నవని ఇటీవలే తెలిసిందన్నారు. ఆ కులాల రొంపిలోకి తన కుటుంబాన్ని లాగొద్దని విజ్ఞప్తి చేశారు. 

ఇకపోతే తాను ప్రశాంతత కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  

ముఖ్యమంత్రిగా తాను పని చేసినంత కాలం ప్రజలకు మంచే చేశానని చెప్పుకొచ్చారు. తాను చేసిన పనులకు ప్రజల గుండెల్లో తనకూ కొంత చోటు ఉందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కుమారస్వామి. 

ఇకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని హెచ్ డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు హీటెక్కాయి. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి పనిచేసినప్పటికీ ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ తీరుపైనా ఎమ్మెల్యేలపైనా చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఒక లెక్క కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. 

ఇకపోతే ఇటీవల జరిగిన బలనిరూపణ పరీక్షలో కుమార స్వామి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

click me!