
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఫలితాలు కొందరు ప్రముఖులకు చేదు అనుభవాన్ని మిగిలించగా.. కొందరిలో మాత్రం జోష్‌ను నింపాయి. అయితే కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు ప్రముఖుల గెలుపోటములను పరిశీలిస్తే.. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య విజయం సాధించారు. కనకపుర నుంచి కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ గెలుపొందారు. ఎన్నికలకు ముందు కేఆర్‌పీపీ పేరుతో పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
>జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కూడా ప్రజలు ఆయనను తిరస్కరించడం ద్వారా.. ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు.
>మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కూడా చేదు అనుభవమే ఎదురైంది. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జగదీష్ షెట్టార్ విజయం సాధించలేకపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేష్ విజయం సాధించారు.
>రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత శ్రీరాములుకు కూడా భారీ షాక్ తగిలింది. బళ్లారి(ఎస్‌టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీరాములు ఓటమిపాలయ్యారు. శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర విజయం సాధించారు.
>చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాష్ట్ర మంత్రి కె సుధాకర్ ఓటమి పాలయ్యారు. సుధాకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు.