
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ కర్ణాటక రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్ 1986 కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి. సీబీఐ పదవి కోసం మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, పంజాబ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ దినకర్ గుప్తాలు పోటీపడ్డారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి నియామక కమిటీ ప్రవీణ్‌వైపే మొగ్గుచూపినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలు ముగిసి, అక్కడ బీజేపీ ఘోర పరాజయం అందుకున్న తర్వాత.. అదే రాష్ట్ర డీజీపీని సీబీఐ చీఫ్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డీజీపీ ప్రవీణ్ సూద్ .. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ప్రవీణ్ సూద్ కర్ణాటక డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన 2024 మేలో పదవీ విరమణ చేయనున్నారు. సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్ సూద్‌ను అధికారికంగా ప్రకటించినట్లయితే.. మే 2023 నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో వుంటారు.