కర్ణాటక: రాజీనామాలు ఆమోదించకుంటే... స్పీకర్‌పై బీజేపీ అవిశ్వాసం

By Siva KodatiFirst Published Jul 8, 2019, 9:23 AM IST
Highlights

కర్ణాటక రాజకీయ సంక్షోభం క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగమేఘాల మీద అమెరికా నుంచి వచ్చి గండాన్ని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటక రాజకీయ సంక్షోభం క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగమేఘాల మీద అమెరికా నుంచి వచ్చి గండాన్ని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు మెత్తబడటం లేదు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్, జేడీఎస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. సంక్షోభాన్ని నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

రాత్రంతా జేడీఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కుమారస్వామి, ఆ పార్టీ అధినేత దేవేగౌడ చర్చలు జరిపారు. కాంగ్రెస్ రెబల్ నేత రామలింగారెడ్డితో కుమారస్వామి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకావాల్సి ఉంది. అయితే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. స్పీకర్ సైతం వారి రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమావేశాలను వాయిదా వేయించాలని కుమారస్వామి భావిస్తున్నారు.

ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపే  అవకాశాలున్నాయి. ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేడీఎస్ గట్టి పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు నిన్న రాత్రి జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఒప్పుకోబోమంటూ జేడీఎస్ నేత రేవణ్ణ మాటల యుద్ధానికి దిగారు.

మంత్రి పదవులు ఇస్తామన్నప్పటికీ రెబల్ ఎమ్మల్యేలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. రేపు ముంబై నుంచి బెంగళూరు వచ్చేందుకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సన్నాహలు చేసుకుంటున్నారు.

అయితే స్పీకర్ రాజీనామాలపై ఏదో ఒకటి తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ రాజీనామాలు ఆమోదించకుంటే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీజేపీ నేతలు ఉండటంతో క్షణక్షణం రాజకీయాలు మారిపోతున్నాయి. తాజా రాజాకీయ పరిణామాలపై బీజేపీ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశమై చర్చించనుంది. 

click me!