యూపీలో కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు, 29 మంది దుర్మరణం

By Siva KodatiFirst Published Jul 8, 2019, 7:56 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ఆగ్రా సమీపంలో కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 29 మంది దుర్మరణం పాలయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు కాల్వలోకి దూసుకెళ్లడంతో 29 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవధ్ డిపోకు చెందిన యూపీ33 ఏటీ5877 నెంబర్ గల బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళుతోంది.

ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై కుబేర్‌పుర్‌ సమీపంలోని జార్నానాలా వద్ద అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులందరు గాఢనిద్రలో ఉండటం, ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకునేలోపే ఘోరం జరిగింది.

బస్సు నీటిలో సుమారు 15 అడుగుల లోతులో మునిగిపోవడంతో ఊపిరాడక 29 మంది మరణించారు. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ ఆర్టీసీ తమ సంస్థ తరపున రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. 

 

UP: 29 dead as bus falls into drain on Yamuna Expressway

Read story | https://t.co/DRSptaQLqk pic.twitter.com/RDb7yV64z0

— ANI Digital (@ani_digital)
click me!