ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. 5 గ్యారెంటీ స్కీమ్‌‌లపై సిద్ధరామయ్య తొలి సంతకం

Siva Kodati |  
Published : May 20, 2023, 07:28 PM ISTUpdated : May 20, 2023, 07:32 PM IST
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్.. 5 గ్యారెంటీ స్కీమ్‌‌లపై సిద్ధరామయ్య తొలి సంతకం

సారాంశం

కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సిద్ధరామయ్య 5 హామీల అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడీయంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వెంటనే నేరుగా సచివాలయానికి చేరుకున్న సిద్ధరామయ్య 5 హామీల అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ పథకాలను అమలు చేసేందుకు ఏడాదికి రూ.50000 కోట్లు ఖర్చు అవుతాయని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీ స్కీమ్‌లు :

గృహ జ్యోతి : కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయడం
గృహ లక్ష్మీ : ఇంటికి పెద్దగా వున్న ప్రతి మహిళ ఖాతాలో రూ.2000
అన్న భాగ్య : దారిద్ర్య రేఖకు దిగువ వున్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం
యువ నిధి : నిరుద్యోగులైన పట్టభద్రులకు ప్రతి నెలా రూ.3000 భృతి. అలాగే డిప్లొమా చేసిన వారికి రూ.1500 కింద భృతి. దీనిని 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి రెండేళ్ల పాటు అందిస్తారు
శక్తి : ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం

అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ గెలిచిన తర్వాత.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుపొందింది అని చాలా విషయాలు రాశారు. భిన్నమైన విశ్లేషణలు జరిగాయి. కానీ మేము పేదలు, దళితులు, ఆదివాసీలకు వెన్నంటే ఉన్నందున కాంగ్రెస్ గెలిచిందని నేను చెప్పాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. తమకు సత్యం, పేద ప్రజలు ఉన్నారని చెప్పారు. బీజేపీ డబ్బు, అధికారం, పోలీసులు అన్నీ ఉన్నాయని.. కానీ కర్ణాటక ప్రజలు వాటిని ఓడించారని అన్నారు. కర్ణాటక ప్రజలు అవినీతిని, ద్వేషాన్ని ఓడించారని తెలిపారు. కర్ణాటకలో విద్వేష మార్కెట్‌లు మూతబడి.. లక్షలాది ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని చెప్పారు. 

‘మేము మీకు 5 వాగ్దానాలు చేసాము. మేము తప్పుడు వాగ్దానాలు చేయము అని చెప్పాను. మేం చెప్పినట్టే చేస్తాం. మరో 1-2 గంటల్లో కర్ణాటక ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’’ అని  కర్ణాటక ప్రజలకు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలనను అందిస్తుందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్