ప్రభుత్వాన్ని నడపటం నా వల్ల కావడం లేదు: సీఎం ఆవేదన

By Siva KodatiFirst Published Jun 19, 2019, 11:41 AM IST
Highlights

ఏ ముహూర్తాన కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణం కొలువుదీరిందో ఆనాటి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామికి కంటి మీద కునుకు ఉండటం లేదు. మిత్రపక్షం నుంచి సహకారం లేకపోగా.. విమర్శలు చేస్తుండటంతో సీఎం అసహనానికి గురవుతున్నారు

ఏ ముహూర్తాన కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణం కొలువుదీరిందో ఆనాటి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామికి కంటి మీద కునుకు ఉండటం లేదు. మిత్రపక్షం నుంచి సహకారం లేకపోగా.. విమర్శలు చేస్తుండటంతో సీఎం అసహనానికి గురవుతున్నారు.

ఒకానొక దశలో ఆయన కార్యకర్తల ముందు కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నడపడం దిన దిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక కష్టాలు, సంకీర్ణ సమస్యల నడుమ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానన్నారు. ముఖ్యమంత్రిగా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్నానని.. ప్రభుత్వాన్ని నడప టం సవాలుగా మారిందని కుమారస్వామి ఉద్వేగంగా చెప్పారు.

సంకీర్ణ ప్రభుత్వంపై తొలి నుంచి అసంతృప్తితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు సీఎంగా కుమారస్వామిని గద్దేదించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు గత కొంతకాలంగా వ్యక్తమవుతున్నాయి.  

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కన్నడనాట వార్తలు వస్తున్నాయి.

చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, బళ్లారి ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు మరికొందరు ఢిల్లీలో బీజేపీ నాయకులతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కుమారస్వామి వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని ఉత్కంఠ నెలకొంది. 
 

click me!