పక్కనే సీఎం, వేదికపైనే ప్రభుత్వంపై స్వామిజీ విమర్శలు.. షాకై మైక్ లాక్కొన్న బసవరాజ్ బొమ్మై

By Siva KodatiFirst Published Jan 27, 2023, 7:44 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఊహించని షాక్ ఎదురైంది. బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు లేవని, వరదల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్వామిజీ విమర్శించారు. దీంతో షాకైన సీఎం వెంటనే ఆయన నుంచి మైక్ లాక్కొన్నారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఊహించని షాక్ ఎదురైంది. బహిరంగ సభలో తన పక్కనే కూర్చొన్న స్వామిజీ తన ప్రభుత్వంపైనే విమర్శలకు దిగారు. ఈ అనూహ్య పరిణామంతో సీఎం బొమ్మై తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే ఆ స్వామిజీ చేతుల్లోని మైక్ లాక్కొని.. విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని మహాదేవపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈఘటన జరిగింది. కాయనేలే మహా సంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానంద పురి స్వామిజీ మహదేవపురలో జరిగిన బహిరంగ సభకు విచ్చేశారు. సీఎం పక్కనే ఆయన కూర్చొని మాట్లాడారు. 

బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాలు లేక నగరవాసులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బెంగళూరులో రోడ్ల పరిస్ధితి అధ్వాన్నంగా వుందని, వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎం కూడా దీని గురించి గతంలో హామీలు ఇచ్చారంటూ బొమ్మై సర్కార్‌పై స్వామిజీ విమర్శలు గుప్పించారు. దీంతో పక్కనే వున్న ముఖ్యమంత్రి స్వామిజీ చేతుల్లోంచి మైక్ తీసుకుని ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

click me!