‘‘మేనేజ్ చేస్తున్నాం’’: కర్ణాటక మంత్రి ఆడియో లీక్ దుమారం.. నష్ట నివారణ చర్యల్లో సీఎం బొమ్మై..

By Sumanth KanukulaFirst Published Aug 16, 2022, 4:10 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి ఏదో ఒక వివాదం ఆయనను ఇబ్బందికి గురిచేస్తూనే ఉంది. తాజాగా ఓ కర్ణాటక మంత్రి ఆడియో లీక్‌ కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి ఏదో ఒక వివాదం ఆయనను ఇబ్బందికి గురిచేస్తూనే ఉంది. తాజాగా ఓ కర్ణాటక మంత్రి ఆడియో లీక్‌ కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆడియో లీక్‌లో చెప్పిన మాటలపై.. సొంత పార్టీ నేతల నుంచే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అసలేం జరిగిందంటే.. కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అందులో ఆయన ‘‘మేము ప్రభుత్వాన్ని నడపట్లేదు. కేవలం మేనేజ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
 
కర్ణాటక రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్న ఆడియో టెప్‌లో.. రూ. 50,000 రుణంపై బ్యాంకు అధికారులు రైతుల నుంచి రెన్యూవల్ ఫీజుగా రూ. 1300 డిమాండ్ చేస్తున్నారని చన్నపట్నానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త మంత్రి మధుస్వామికి ఫిర్యాదు చేశారు.  దీనిని వడ్డీగా ఉంచుతున్నారని.. ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి మధుస్వామి.. ‘‘నేను ఏమి చేయగలను. ఇవన్నీ నాకు తెలుసు. నేను ఈ సమస్యలను మంత్రి సోమశేఖర్ దృష్టికి తీసుకువెళ్లాను. కానీ ఆయన ఏమీ చేయడం లేదు. మేము ఏమి చేస్తాం?. మేం ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేం మేనేజ్ చేస్తున్నాం. ఇంకో ఎనిమిది నెలలు (అసెంబ్లీ ఎన్నికల వరకు) తోస్తే చాలు’’ అని పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై తోటి మంత్రులు ఫైర్ అయ్యారు. ఆ ఆడియోలో సహకార శాఖ మంత్రి సోమశేఖర్ పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన తాజాగా స్పందించారు. మధుస్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో వందలాది కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో నిపుణులు లేరనే భావనలో మధుస్వామి ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘

‘‘అతను మాత్రమే నిపుణుడని,  తెలివైనవాడినని, జ్ఞానవంతుడని భావిస్తాడు. అతను మనస్సు నుండి అలాంటి ఆలోచనను తొలగించాలి. మంత్రివర్గంలో చాలా మంది అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉన్నారు’’ అని సోమశేఖర్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్నందున రైతులను ఆదుకునేందుకు ఏర్పాటైన డీసీసీ బ్యాంకులు లేదా ఇతర సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయలేనని చెప్పారు. “ఏదైనా తప్పు జరిగితే.. శాఖపరమైన విచారణ జరుగుతుంది. ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

‘‘మేము మేనేజ్ చేస్తున్నామని అతను భావిస్తే.. వెంటనే కర్ణాటక న్యాయ శాఖ మంత్రిగా పదవీ విరమణ చేయాలి. అతను ప్రభుత్వంలో ఒక భాగమే. అతను ప్రతి కేబినెట్ సమావేశంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగం. అతను ఆ ప్రకటన చేసి ఉంటే.. అతను కూడా అందులో భాగస్వామ్యుడే. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి ప్రకటన చేయడం బాధ్యతారాహిత్యం’’ అని సోమశేఖర్ అన్నారు. 

ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇది ఆయన ప్రభుత్వంపైనే ఆరోపణ చేశారా? లేదా మంత్రి మధుస్వామి నిస్సహాయతనా? లేక పాలనపై అసంతృప్తినా?” అని కాంగ్రెస్ ప్రశ్నించింది.

స్పందించిన సీఎం బసవరాజు బొమ్మై..
జేసీ మధుస్వామి వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపుతుండటంతో.. తాజాగా సీఎం బసవరాజు బొమ్మై నష్టనివారణ చర్యలకు దిగారు. ఈ వ్యాఖ్యలు ప్రామాణికమైనవని.. కానీ సందర్భానుసారం తీసుకోలేదని సీఎం బొమ్మై ఈ రోజు మీడియాకు తెలిపారు. ‘‘అతను (మధుస్వామి) వేరే సందర్భంలో చెప్పాడు. నేను అతనితో మాట్లాడాను. సందర్భం వేరు కాబట్టి దానిని తప్పుగా తీసుకోవలసిన అవసరం లేదు. అతను కొన్ని సహకార సంబంధిత సమస్యకు సంబంధించి విషయాలు ప్రత్యేకంగా మాట్లాడారు.  అంతా బాగానే ఉంది.. ఎలాంటి సమస్య లేదు’’ అని బొమ్మై చెప్పారు. మధుస్వామి వ్యాఖ్యాలపై ఇతర కేబినెట్ మంత్రులు విమర్శల గురించి ప్రస్తావించగా.. ‘‘నేను సంబంధిత అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను’’ అని సీఎం బొమ్మై తెలిపారు. 

click me!