కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. వ్యూహాత్మకంగా సిద్ధరామయ్య, కీలక శాఖలు తన వద్దే, డీకే చేతికి రెండే..?

By Siva KodatiFirst Published May 27, 2023, 5:03 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం తన కేబినెట్‌ను విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు ఎలాంటి పదవులు దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. 

అనేక తర్జన భర్జనలు, సుదీర్ఘ కసరత్తు అనంతరం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. శనివారం మరో 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆరుగురు లింగాయత్, నలుగురు వొక్కలిగ, ముగ్గురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు , ఇద్దరు ముస్లింలు, ఐదుగురు ఓబీసీ, ఒక బ్రాహ్మణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన నేతకు ఛాన్స్ దక్కింది. పాత మైసూర్, కళ్యాణ కర్ణాటక ప్రాంతం నుంచి ఏడుగురికి, కిట్టూరు కర్ణాటక ప్రాంతం నుంచి ఆరుగురికి, సెంట్రల్ కర్ణాటక నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది.

అయితే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కీలక శాఖలను ఆయన తన వద్దే వుంచుకున్నారు. ఆర్ధిక, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటెలిజెన్స్ విభాగాలను సీఎం పర్యవేక్షించనున్నారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌కు నీటిపారుదల, బెంగళూరు అభివృద్ధి శాఖలను కేటాయించారు సీఎం. మంత్రుల ఎంపిక, వారికి శాఖల కేటాయింపు అనేది సిద్దూ, డీకేల మధ్య టగ్ ఆఫ్ వార్ అని విశ్లేషకులు తొలి నుంచి చెబుతున్నారు. అయితే తుది ఎంపికలో సీఎం సిద్ధరామయ్యికి ఎక్కువ ప్రాధాన్యత దక్కినట్లే కనిపిస్తోంది. 24 మంది కొత్త మంత్రుల్లో 12 మందికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం లేదు. 

ALso Read: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మంత్రిత్వ శాఖలపై ఉత్కంఠ.. హోం శాఖ ఆయనకేనా?

మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకున్న బోస్‌రాజ్‌ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏఐసీసీ, కేపీసీసీలలో కీలక సభ్యుడిగా పనిచేసిన ఆయన రాష్ట్ర కాంగ్రెస్, హైకమాండ్ మధ్య అనుసంధానకర్తగా పనిచేశారు. శాసనమండలి, అసెంబ్లీలో సభ్యుడు కానప్పటికీ బోస్‌రాజు మంత్రి పదవి దక్కించుకున్నారు. సీనియర్ నేతలు హెచ్‌కే పాటిల్, డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, శరణబసస్ప దర్శనాపూర్, శివానంద్ పాటిల్ సైతం తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. కొత్త మంత్రుల్లో ఆరుగురు బెంగళూరు నగరానికి చెందినవారే. వీరిలో రామలింగారెడ్డి, కేజే జార్జ్, బీజెడ్ జమీర్ అహ్మద్, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేష్, దినేశ్ గుండూరావు వున్నారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించగా.. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం వుంది. 

click me!