కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ

By sivanagaprasad KodatiFirst Published Nov 6, 2018, 9:17 AM IST
Highlights

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది. 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది.. దీనికి కూడా చెమటోడ్చాల్సి వచ్చింది.

బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌లు రాజీనామా చేయడం.. రామనగర అసెంబ్లీ స్థానాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి వదలుకోవడం.. జమఖండి ఎమ్మెల్యే మరణించడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. గత శనివారం ఈ స్థానాల్లో పోలింగ్ జరిగ్గా.. ఇవాల ఓట్లు లెక్కింపు చేపట్టారు.

మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామ గౌడ.. బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు.  రామనగర నుంచి జేడీఎస్ అభ్యర్ధి, ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, అనితా కుమారస్వామి విజయం సాధించగా.. జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ న్యామగౌడ్‌ విజయం సాధించారు.

బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్ప... బీజేపీ అభ్యర్థి శాంతపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన శివమొగ్గలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు తలపడ్డారు.

బీజేపీ తరపున మాజీ సీఎం యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప కుమారుడు మధు బంగారప్పను ఓడించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన లెక్కింపులో అంతిమంగా బీజేపీనే విజయం వరించింది.. రాఘవేంద్ర 50 వేలకు పైచిలుకు మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

click me!