యడియూరప్ప తర్వాత నేనే: బాంబు పేల్చిన ఎమ్మెల్యే శ్రీరాములు

By Nagaraju penumalaFirst Published Jul 27, 2019, 1:37 PM IST
Highlights

బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తాను ఆ పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన యడియూరప్పకు కేబినెట్ కూర్పు కత్తిమీద సామే అన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుమార స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీకి కేబినెట్ కూర్పు పెద్ద సవాల్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇదిలా ఉంటే కేబినెట్ కూర్పుపై మెలకాల్మూరు ఎమ్మెల్యే బి.శ్రీరాములు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. తాను ఆ పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు.

బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. తనకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారని ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.  

అయితే అభిమానులు కోరుకోవడంలో తప్పులేదన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి తాను కొన్ని దశాబ్ధాల కాలంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకే రాష్ట్రంలో యడియూరప్ప తర్వాత తన పేరే బీజేపీలో వినిపించడానికి కారణమన్నారు. 

ఇకపోతే పార్టీ నాయకత్వం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి అనేకమంది కష్టాపడ్డారని, ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పార్టీలో ప్రతి ఒక్కరు అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు.  

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకొచ్చారు. యడియూరప్ప ముఖ్యమంత్రి కావాలన్నదే తన ఆకాంక్ష అని అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని శ్రీరాములు తెలిపారు. 

click me!