కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Mar 29, 2023, 12:10 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టుగా  సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మే 10న పోలింగ్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టుగా తెలిపారు. షెడ్యూల్.. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 20. నామినేషన్‌ల పరిశీలన.. ఏప్రిల్ 21.  నామినేషన్‌ల ఉపసంహరణ  గడవును ఏప్రిల్ 24గా నిర్ణయించారు. మే 10న పోలింగ్ నిర్వహించనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

కర్ణాటకలో మొత్తం 5.2 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఫస్ట్ టైమ్ ఓటర్స్ 9.17 లక్షలు, పీడబ్ల్యూడీ ఓటర్స్ 5.5 లక్షలు ఉన్నారని చెప్పారు. ఇక, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు(పీడబ్ల్యూడీ) వారి ఇళ్ల నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పారు. 

అలాగే జలంధర్ లోక్‌సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. జలంధర్ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఝర్సుగూడ (ఒడిశా), ఛన్‌బే (ఉత్తరప్రదేశ్), సువార్ (ఉత్తరప్రదేశ్), సోహ్లాంగ్ (మేఘాలయ) ఎన్నికల తేదీని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. షెడ్యూల్.. ఏప్రిల్ 13 గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఏప్రిల్ 20. నామినేషన్‌ల పరిశీలన.. ఏప్రిల్ 21.  నామినేషన్‌ల ఉపసంహరణ  గడవును ఏప్రిల్ 24గా నిర్ణయించారు. మే 10న పోలింగ్ నిర్వహించనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇక, 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం మే 24తో ముగియనున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

కర్ణాటకలో అధికారమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు.. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే షెడ్యూల్ విడుదలకు ముందుగానే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో తొలి  జాబితాను ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 20న విడుదల చేసింది. 

click me!