
Shiv Sena Uddhav faction leader Sanjay Raut: మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు తమ పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ, పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొంటామని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ బుధవారం చెప్పారు. సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై థాక్రే వర్గం మండిపడి, ప్రతిపక్ష సమావేశానికి గైర్హాజరైన సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, తాజాగా ఆ పార్టీ ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకుంది.
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం మాట్లాడుతూ, తమ పార్టీ ఈ రోజు ప్రతిపక్ష సమావేశానికి హాజరవుతుందని, నిరసనలో కూడా పాల్గొంటుందని చెప్పారు. ఉద్ధవ్ థాక్రేకు కోపం తెప్పించిన రాహుల్ గాంధీ సావర్కర్ వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి పార్టీ గైర్హాజరైన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంజయ్ రౌత్ వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగే ప్రతిపక్షాల సమావేశానికి తప్పకుండా హాజరవుతామని, నిరసనలో కూడా పాల్గొంటామని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశంలోనూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
'మాకు ఎదురైన నిరాశా నిస్పృహల గురించి రెండు రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి తాము హాజరుకాలేదన్నది వాస్తవమేనని, అయితే ఏ సమస్య వచ్చినా దాన్ని అనుకున్న చోటే పరిష్కరించామని, ఫలితం తమకు లభించిందని సంజయ్ రౌత్ అన్నారు. గత వారం ఒక విలేకరుల సమావేశంలో, రాహుల్ గాంధీ తన లండన్ ప్రసంగానికి క్షమాపణలు చెప్పడం గురించి అడిగినప్పుడు - భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉందని చెప్పారు. బీజేపీ డిమాండ్ పై తాను క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. తన పేరు సావర్కర్ కాదనీ, తన పేరు గాంధీ అని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పరని ఆయన అన్నారు. అయితే, సావర్కర్ ను కించపరచడం వల్ల ప్రతిపక్షాలు, మహారాష్ట్ర కూటమిలో చీలికలు వస్తాయని రాహుల్ గాంధీని థాక్రే హెచ్చరించారు.
"దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం ఒక్కటయ్యామని రాహుల్ గాంధీకి చెప్పదలుచుకున్నాను. కానీ విభేదాలు సృష్టించే ప్రకటనలు చేయవద్దు" అని హితవు పలికారు. థాక్రే హెచ్చరిక క్రమంలో ఖర్గే విందు సమావేశానికి ఆయన గైర్హాజరు కావడంతో సావర్కర్ వంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యానించకూడదని కాంగ్రెస్, ఇతర 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.