అరాచక శకం ముగిసింది.. మాకు పండగ రోజు : వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై గ్రామస్తుల సంబరాలు

Siva Kodati |  
Published : Jul 10, 2020, 04:29 PM IST
అరాచక శకం ముగిసింది.. మాకు పండగ రోజు : వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై గ్రామస్తుల సంబరాలు

సారాంశం

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో ఆయన స్వస్థలం కాన్పూర్‌కు సమీపంలోని బిక్రూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అతని అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని వారు సంబరాలు చేసుకుంటున్నారు

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో ఆయన స్వస్థలం కాన్పూర్‌కు సమీపంలోని బిక్రూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అతని అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని వారు సంబరాలు చేసుకుంటున్నారు.

ఎన్నో ఏళ్లుగా తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వికాస్.. పోలీసుల చేతిలో హతమయ్యాడని తెలుసుకుని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను ఇదే గ్రామంలో వికాస్ దూబే, ఆయన అనుచరులు కాల్చి చంపారు.

దూబే అరాచకాలకు తామంతా బాధితులమేనని గ్రామస్తులు.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. అతని ఆగడాలపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. 2013లో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేదని గ్రామస్తులు వాపోయారు.

Also Read:మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్

వికాస్ దూబే నేరసామ్రాజ్యం బలహీనపడటం తాము ఎన్నడూ చూడలేదని.. రాజకీయ నేతలు సైతం అతనికి అండగా నిలిచేవారని తెలిపారు. ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే సైతం వికాస్‌కు రాఖీ కట్టి ఆయన తనకు సోదరుడని చెప్పుకున్నారని చెప్పారు.

దూబే చిన్నపాటి విషయాలనే తమ కుటుంబసభ్యులు, బంధువులను దారుణంగా కొట్టేవాడని, ఆయన అనుచరులు రోడ్ల మీద వెళ్లే సమయంలో తాము తలపైకి ఎత్తకూడదని, నమస్కారం చేయాలని స్థానికులు తెలిపారు.

అతని పీడ విరగడైన ఈ రోజు తమకు పండుగ రోజని, చివరికి అరాచక శకం ముగిసిందని గ్రామస్తులు అన్నారు. భగవంతుడు తమ ప్రార్థనలను విన్నాడని అన్నారు.

కాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడ్డ వికాస్ దూబేని ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసు ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా చేసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో తీవ్రగాయాల పాలైన వికాస్ దూబేను కాన్పూర్ ఆసుపత్రికి తరలించగా అతను మరణించాడు. వికాస్ దూబేపై పలు హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్ అభియోగాలున్నాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu