మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరమైంది. సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ సీఎం, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ కమల్ నాథ్ బీజేపీలోకి వెళ్లుతున్నారనే చర్చ సంచలనం రేపింది. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ స్పందించి.. ఆయన పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చింది.
Kamal Nath: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. అంతకు ముందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ బాధ్యతలు చేపట్టారు. కానీ, నెలల వ్యవధిలోనే జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ నాథ్ సారథ్యంలోనే కాంగ్రెస్ బరిలోకి దిగినా.. మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీతో పొత్తు విబేధించడంతో ఇండియా కూటమిలో తొలి సవాల్ ఎదురైంది. వీటికి కమల్ నాథ్ అసలు కారకుడనే వాదన ఉన్నది.
ఎన్నికల్లో పరాజయం తర్వాత కమల్ నాథ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టింది పార్టీ. ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జితు పట్వారీ. కమల్ నాథ్ కొడుకుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే చర్చ నేపథ్యంలో కమల్ నాథ్ తన వర్గంతో బీజేపీలో చేరుతున్నాడనే వార్తలు వచ్చాయి. ఫిరాయింపుల చట్టం నుంచి బయటపడటానికి 23 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలోకి వెళ్లుతున్నారని చర్చ జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కమల్ నాథ్ ఢిల్లీలో ఉండగా ఈ వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కొట్టిపారేస్తున్నది. ‘ఇది కేవలం కమల్ నాథ్ పై జరుగుతున్న కుట్ర మాత్రమే. నేను ఆయనతో మాట్లాడాను. ఇవన్నీ వట్టి వదంతులేనని, తాను నిఖార్సైన కాంగ్రెస్‌వాదినని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడిగానే కొనసాగుతానని వివరించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ భావజాలంతోనే జీవిస్తారని తెలిపారు. ఇవి ఆయన వాస్తవ ఆలోచనలు’ అని కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ వివరించారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతర కోసం హెలికాప్టర్ ట్యాక్సీలు.. ఎలా బుక్ చేయాలంటే?
కమల్ నాథ్ అనునాయుల్లోని ఓ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలతో కమల్ నాథ్ పార్టీ మారుతున్నారనే చర్చ జోరుగా సాగింది. కమల్‌నాథ్‌ను అవమానకరంగా పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, ప్రజలు ఆయనను బీజేపీలోకి చేరాలని అనుకుంటున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దీపక్ సక్సేనా ఏఎన్ఐకి తెలిపారు. కమల్ నాథ్ వెంట తాను, మరికొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఉంటామని చెప్పారు.