Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్

Published : May 29, 2025, 12:14 AM IST
Kamal Thug Life

సారాంశం

Kamal Haasan: కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలు జూన్ 19న జరగనున్నాయి.

Kamal Haasan: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడు శాసనసభలో డీఎంకేకి ఉన్న మెజారిటీ ఆధారంగా వచ్చే జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సులభంగానే గెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం డీఎంకే తన ముగ్గురు అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, మిత్ర పక్షమైన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)కు ఒక సీటును కేటాయించింది. సినీనటుడు-రాజకీయ నేత కమల్ హాసన్‌కు పార్లమెంట్‌కు పంపాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది.

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంఎస్ స్టాలిన్ ప్రకటించిన ప్రకారం, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు కేటాయించడం గతంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా ఉందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పక్షాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

డీఎంకే తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా ఎంపికైన వారు వీరే

1. పి. విల్సన్ - ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్, మాజీ అదనపు సోలిసిటర్ జనరల్.

2. ఎస్.ఆర్. శివలింగం - సేలం ఈస్ట్ జిల్లా కార్యదర్శి, 1989, 1996లో డీఎంకే ఎమ్మెల్యేగా సేవలందించారు.

3. సల్మా (రోక్కయ్యా మాలిక్) - ప్రముఖ రచయిత, పార్టీ అధికార ప్రతినిధి. 2006లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఈ అభ్యర్థుల ఎంపిక సామాజిక సమతుల్యతను ప్రతిబింబిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సల్మా ముస్లిం, విల్సన్ క్రైస్తవులు, శివలింగం హిందువులు కావడంతో పార్టీ విభిన్నతను చూపించగలిగింది. ఎంఎన్‌ఎం బుధవారం నిర్వహించిన కార్యనిర్వాహక-పరిపాలనా కమిటీల సమావేశం అనంతరం కమల్ హాసన్‌ను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించింది. కమిటీ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ. అరుణాచలం అధ్యక్షత వహించారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ, “ఇది నా స్వరం కాదు, ప్రజల స్వరం.. పార్లమెంట్‌లో వినిపించనుంది. అందరికీ నేను ప్రతినిధిగా మాట్లాడతాను” అని తిరువనంతపురంలో తన అభ్యర్థిత్వంపై స్పందించారు. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్‌ను అభినందిస్తూ.. "రాజ్యసభలో తమిళనాడు హక్కుల కోసం, రాజ్యాంగం, జాతీయ సమైక్యత కోసం ఆయన స్వరం వినిపించనుండడం సంతోషకరమని" అన్నారు. కమల్ హాసన్ దీనికి కృతజ్ఞతలు తెలిపారు.

జూన్ 9 నామినేషన్లకు చివరి తేదీ కాగా, జూన్ 10 నామినేషన్ల పరిశీలన జరగనుంది. పోలింగ్ జూన్ 19న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడికావచ్చు. ఇతర పక్షాల విషయానికొస్తే, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, శాసనసభలో వారి బలాబలాలతో వారు రెండు సీట్లు గెలుచుకునే అవకాశముంది.

కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యంను స్థాపించినప్పటి నుంచి రాజకీయంగా పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, రాజకీయాల్లో కొనసాగుతానని నిశ్చయంగా చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేయని ఆ పార్టీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. తమిళనాడు నుంచి వచ్చే ఆరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూలై 24న ముగియనుంది. వీరిలో డీఎంకేకు చెందిన షణ్ముగం, మొహమ్మద్ అబ్దుల్లా, పి. విల్సన్, ఎంఎంఎంకే నేత వైకో, పీఎంకే నేత అంబుమణి రామదాస్ ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్త సభ్యులుగా కమల్ హాసన్ సహా నలుగురు ఎన్నికవుతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు