
Jodhpur communal clashes: రాజస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మత ఘర్షణలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వామే కారణమంటూ ఆరోపించారు. సీఎం అశోక్ గెహ్లాట్ ను మరో రోమన్ నీరో చక్రవర్తితో పోల్చారు. గెహ్లాట్ సొంత జిల్లా జోధ్‌పూర్‌లో ఈద్‌కు ముందు మతపరమైన హింస చెలరేగినప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ముఖ్యమంత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని జేపీ నడ్డా ఆరోపించారు.
“నేను ఈరోజు రాజస్థాన్ గురించి మాట్లాడితే.. అది శ్రేయస్కరం కాదు, కానీ మనం వార్తాపత్రికలను తెరిచినప్పుడు, కరౌలి, జోధ్‌పూర్, జైపూర్ లేదా మరేదైనా నగరానికి సంబంధించిన సంఘటనలను చూస్తాము. ఒక వైపు, మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా మరియు ప్రతిస్పందిస్తుందని మేము చెబుతాము. జోధ్‌పూర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఘర్షణలు చోటుచేసుకున్న వేళ.. ఆ రోజు గెహ్లాట్ సాహబ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రోమ్ కాలిపోతున్నప్పుడు, నీరో వేణువు వాయిస్తున్నాడు” అని శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్‌లోని బికనీర్ డివిజన్ పార్టీ బూత్ సమావేశంలో జేపీ నడ్డా అన్నారు. .
హింసాకాండ జరిగిన తర్వాత తన స్వస్థలమైన జోధ్‌పూర్‌ను సందర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని అశోక్ గెహ్లాట్‌ను జేపీ. నడ్డా ప్రశ్నించారు. "అశోక్ గెహ్లాట్ తన సొంత జిల్లా అయిన జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి ఉండాల్సింది కాదా? మీరు అక్కడికి వెళ్లి ఉండాల్సింది. మీరు వెళ్లలేదు, అంటే మీరు ఎంత అక్కడి వారిని.. రాజస్థాన్ ప్రజలను మీరు ప్రేమిస్తున్నారో తెలుస్తుంది" అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న ఉజ్వల యోజన వంటి సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ, నడ్డా అశోక్ గెహ్లాట్‌ను మరింత లక్ష్యంగా చేసుకుని.. "ఆయన ప్రాథమిక సమస్యల గురించి మాట్లాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? అతను అల్లర్లు, కులాలు, వర్గాల గురించి లేదా సమాజాన్ని విభజించడం గురించి మాట్లాడతాడు. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్ గురించి మాట్లాడతాం" అంటూ పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించిన జేపీ నడ్డా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2019-20 ప్రకారం మహిళలపై అఘాయిత్యాల కేసులలో రాజస్థాన్ నంబర్ వన్ స్థానంలో ఉందని మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాలపై నేరాలలో రెండవ స్థానంలో ఉందని అన్నారు. షెడ్యూల్డ్ కులాలపై నేరాల్లో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. కాగా, గత రెండు నెలలుగా రాజస్థాన్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఈద్‌కి కొన్ని గంటల ముందు గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.. రెండు వర్గాలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, నగరంలోని 10 పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.