జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా చంపా సోరెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపా సోరేన్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజుల క్రితం హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సోరేన్ స్థానంలో జేఎంఎం శాసనసభ్యులు చంపా సోరేన్ ను తమ పార్టీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు.ఈ విషయమై ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు చంపై సోరేన్ లేఖ అందించారు. ఇవాళ కొత్త సీఎంగా చంపా సోరేన్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పది రోజుల్లోపుగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సీఎం చంపా సోరేన్ ను ఆదేశించారు.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చంపా సోరెన్ ప్రముఖుడు. జార్ఖండ్ ముక్తి మోర్చా లో అత్యంత సీనియర్ నాయకుళ్లలో చంపా సోరెన్ ఒకరు. హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్టు ,సంక్షేమం వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.
జెఎంఎం వ్యవస్థాపకులు శిబూ సోరెన్ తో చంపా సోరెన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. సరైకెలా -ఖర్సవాన్ జిల్లాలోని జిలింగగోడ గ్రామంలో రైతు కుటుంబంలో చంపా సోరెన్ జన్మించాడు. 1970లో జార్ఖండ్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 1973లో జేఎంఎం ఏర్పడింది. చంపా సోరెన్ ను అతని అభిమానులు టైగర్ కోల్హాన్ గా పిలుస్తారు. 1990లో జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీలో అసంఘటిత కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఆందోళనకు నాయకత్వం వహించారు. 1993లో పేలుడు పదార్ధాల చట్లంలోని సెక్షన్ల కింద ఆయనపై కేసు కూడ నమోదైంది.
చంపా సోరెన్ 1995లో సరైకేలా అసెంబ్లీ స్థానం నుండి ఆయన విజయం సాధించాడు. ఐదేళ్ల తర్వాత ఇదే స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.చంపా సోరెన్ తనకు మద్దతిస్తున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి హైద్రాబాద్ కు తరలిరానున్నారు. అసెంబ్లీలో బలనిరూపణ జరిగే వరకు బీజేపీ నేతలతో జేఎంఎం, ఆ పార్టీకి మద్దతిస్తున్న పార్టీలతో టచ్ లోకి వెళ్లకుండా క్యాంప్ రాజకీయాలకు జేఎంఎం తెరతీసింది. జార్ఖండ్ నుండి రెండు ప్రత్యేక విమానాల్లో జేఎంఎం, ఆ పార్టీ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హైద్రాబాద్ కు తరలివస్తారు. హైద్రాబాద్ శివారులోని హోటల్ లో ఎమ్మెల్యేలు బసచేస్తారు.