
Live-in Relationship-dramatic incident: ఒకే గదిలో నెలపాటు లివ్ఇన్ రిలేషన్‌షిప్ లో ఉన్నారు. కానీ కోర్టులో ప్రియుడికి షాక్ ఇచ్చింది ఆ ప్రియురాలు. అతను కేవలం తనకు అన్నలాంటి వ్యక్తి అనీ, తాను వెళ్లిపోతే చనిపోతాడెమోననే భయంతో ఇంతకాలం కలిసి ఉన్నానని చెప్పింది. దీంతో షాక్ కు గురైన యువకుడు జడ్జి ఛాంబర్ లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి కత్తితో చేయిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన కేరళ హైకోర్టులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి, నెలరోజులుగా ఒక యువతితో ఒకే గదిలో ఉంటూ లివ్ఇన్ రిలేషన్‌షిప్ లో కొనసాగుతున్నారు. వారి ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో వచ్చి ఉంటోంది ప్రియురాలు. ఇదే నేపథ్యంలో తన కూతురు కనిపించడం లేదంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురిని కిడ్నాప్ చేసి.. గదిలో బంధించాడని పేర్కొన్నాడు. అయితే, మీడియా, పోలీసుల ముందు అలాంటిదేమీ లేదని ఆ యువతి చెప్పింది.
కానీ, కోర్టులో ప్రియుడికి షాక్ ఇస్తూ.. జడ్జిముందు ఇచ్చిన వాంగ్మూలంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కోర్టులో ఆ యువతి.. విష్ణు తనకు అన్నలాంటి వాడనీ, ఇతర ఫీలింగ్స్ ఏమీ లేవని చెప్పింది. తన కుటుంబంతో కలిసి వెళ్లాలనుకుంటున్నానని పేర్కొంది. యువతి వాంగ్మూలంతో షాక్ గు గురైన యువకుడు జడ్జి ఛాంబర్ లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మరో ట్విస్ట్ అప్పటికే ఆ వ్యక్తికి పెళ్లి అయింది. వేరే అమ్మాయితో ఉంటున్నాడని అతన్ని భార్య వదిలేసింది.