అనుకున్నదంతా అయ్యిందిగా.. జార్ఖండ్ సీఎం‌ హేమంత్ సోరెన్‌ శాసనసభ సభ్యత్వం రద్దు

By Siva KodatiFirst Published Aug 26, 2022, 4:14 PM IST
Highlights

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేసింది ఎన్నికల సంఘం. ఈసీ సిఫారసుతో సభ్యత్వం రద్దు చేశారు గవర్నర్. 

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేసింది ఎన్నికల సంఘం. ఈసీ సిఫారసుతో సభ్యత్వం రద్దు చేశారు గవర్నర్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సీఎం సోరెన్‌పై అనర్హత వేటు వేసింది ఈసీ. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. తదుపరి జార్ఖండ్ సీఎం ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు తానే మైనింగ్ కేటాయించుకున్నారని సోరెన్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ అనర్హత వేటు వేసింది. 

మైనింగ్ శాఖ బాధ్యతలు చూస్తున్న సోరెన్.. తనకు తానే లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ బీజేపీ సీనియర్ నేత రఘుబర్ దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని కోరారు జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్. దీనిలో భాగంగా హేమంత్ సోరెన్‌ను తొలగించాలని ఈసీ... గవర్నర్‌కు సిఫారసు చేసింది. 

ALso REad:జార్ఖండ్ సీఎం కు షాక్: ఎమ్మెల్యేగా అనర్హతకు ఈసీ సిఫారసు

ఇకపోతే.. హేమంత్ సోరెన్ స‌న్నిహితుడైన‌ ప్రేమ్ ప్ర‌కాష్ ను ఈడీ గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధ‌వారం ఆయ‌న ఇంట్లో నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్న త‌రువాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్లు నిర్వ‌హించిన త‌రువాత బుధ‌వారం రాత్రి ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయ‌న‌ను రాంచీలో అరెస్టు చేశారు. 

ప్రేమ్ ప్రకాష్ ఇంటి నుంచి బుధవారం రెండు ఏకే-47 రైఫిళ్లు, 60 కాట్రిడ్జ్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. 100 కోట్ల అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్‌లోని ప్రేమ్ ప్రకాష్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా ఇనుప అల్మ‌రాలో ఉంచిన రెండు ఏకే-47లు ల‌భించాయ‌ని అధికారులు తెలిపారు. అయితే ప్రేమ్ ప్రకాష్ నివాసం నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు (AL-47) పోలీసుల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి చెందినవని అర్గోరా పోలీస్ స్టేషన్ SHO వినోద్ కుమార్ తెలిపారు. ప్రేమ్ ప్రకాష్ ఇంట్లో రైఫిల్స్ ఉంచినందుకు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మే నెలలో ఏజెన్సీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రేమ్ ప్రకాష్‌ను విచారించింది

click me!