
Bird Flu In Jharkhand: దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ రంగానికి చెందిన వారు క్రియాశీలకంగా మారడంతో పాటు పలు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్ లోని బొకారో జిల్లా సెక్టార్ 12లోని లోహంచల్ లో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ బారిన పడి గత ఐదు రోజుల్లో 400కు పైగా కోళ్లు మృతి చెందినట్లు కోల్ కతా ల్యాబ్ ధృవీకరించింది. బొకారో జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో జార్ఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. దీనికి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ రంగానికి చెందిన వారు క్రియాశీలకంగా మారడంతో పాటు పలు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. బొకారో డిప్యూటీ కమిషనర్ (డీసీ) కుల్దీప్ చౌదరి సమావేశం నిర్వహించి చికెన్ తినడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
"రూమ్ నెంబర్ 2లో 298 కడక్ నాథ్, రూమ్ నెంబర్ 3లో 186 రోడ్ ఐలాండ్ రెడ్ కోళ్లు మృతి చెందాయి. కోల్ కతా ల్యాబ్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. రాంచీ నుంచి వచ్చిన పశుసంవర్ధక శాఖ బృందం చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి దర్యాప్తు కోసం కోల్ కతా, మధ్యప్రదేశ్ కు పంపించిందని" జిల్లా పశుసంవర్ధక అధికారి మనోజ్ కుమార్ మణి తెలిపారు. కడక్ నాథ్, ఆర్ఐఆర్ అనే రెండు జాతుల కోళ్లను ఈ ఫామ్ లో ఉంచుతారు. రెండు జాతుల్లోనూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దర్యాప్తులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందన్నారు.
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా.. సాధారణంగా దీనిని బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. ఇది పక్షుల్లో వచ్చే అంటు వైరల్ వ్యాధి. దీని వల్ల బాతులు, అడవి నీటి కోళ్లు, సాధారణ కోళ్ల జాతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని వైద్య పరిశోధకులు పేర్కొంటున్నారు. అడవి పక్షులు వైరస్ లక్షణాలను చూపించకుండా కారకాలను మోసుకెళ్తాయి.. అయితే, వాటి ఈకలు లేదా మలం ద్వారా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తిని గుర్తించేందుకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు పైన పేర్కొన్న కోళ్ల ఫారం నుంచి మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. బొకారోలో 10 కిలోమీటర్ల పరిధిలో ర్యాండమ్ శాంపిలింగ్ నిర్వహించి బర్డ్ ఫ్లూ వ్యాప్తికి చెక్ పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి మూలాలను తెలుసుకోవడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బొకారో సహా అలాంటి అనుమానిత ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిషేధించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.