విషాదం: అన్నం లేక మహిళ మృతి, విచారణకు సర్కార్ ఆదేశం

First Published Jun 4, 2018, 5:51 PM IST
Highlights

3 రోజులుగా పస్తులతో మహిళ మృతి


రాంచీ: మూడు రోజులుగా అన్నం లేక  58 ఏళ్ళ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధ్ జిల్లా దుమ్రీ బ్లాక్‌లోని  మంగరగాడి గ్రామంలో వెలుగు చూసింది.మంగరగాడి గ్రామానికి చెందిన సావిత్రి దేవి అనే మహిళ శనివారం ఆకలిచావుకు గురైంది.మృతురాలి చిన్న కుమారుడు ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాతే ఆమె మరణించిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.

బాధిత మహిళ కుటుంబానికి రేషన్‌ కార్డు లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. సావిత్రి దేవి మృతిపై విచారణ చేపట్టారు.
మృతురాలి ఇంటిలో కొన్ని రోజులుగా ఆహరధాన్యాలు కూడ లేవని అధికారులు గుర్తించారు. ఈ కుటుంబానికి రేషన్ కార్డు కూడ లేదని తమ విచారణలో వెల్లడైందని  ఎగ్జిక్ూటివ్ మేజిస్ట్రేట్ రాహుల్ దేవ్ చెప్పారు.


రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై విచారిస్తున్నామని చెప్పారు. రేషన్‌ కార్డు ఎందుకు మంజూరు కాలేదో ఆరా తీస్తామన్నారు. బాధిత మహిళ సహా కుటుంబ సభ్యులెవరూ ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎందుకు లబ్ధి పొందలేదో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. సావిత్రి దేవి పెద్ద కోడలు రెండు నెలల కిందట తన రేషన్‌ కార్డు దరఖాస్తు వెరిఫికేషన్‌ కోసం తమ వద్దకు వచ్చిందని, మరి దాన్ని బ్లాక్‌ ఆఫీస్‌లో అందచేశారో లేదో తనకు తెలియదని గ్రామ సర్పంచ్‌ రామ్‌ ప్రసాద్‌ మహతో పేర్కొన్నారు.  

ఎనిమిది రోజుల కిందట సావిత్రి దేవి కోడలు తమ ఇంట్లో ఆహార ధాన్యాలు లేవని చెప్పడంతో తాము సర్ధుబాటు చేశామని స్వయం సహాయక బృంద సభ్యురాలు సునీతా తెలిపారు. 
సావిత్రి మృతిపై జార్ఖండ్‌ ఆహార, పౌరసరఫరాల మంత్రి సరయూ రాయ్‌  సవివర నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ను  ఆదేశించారు

click me!