
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ విద్యార్థి సింగరాజు వెంకట్ కౌండిన్య జేఈఈ మెయిన్ 2023 పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం ద్వారా టాపర్‌గా నిలిచారు. వెంకట్ మొత్తం 300కు 300 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
ఏపీలోని నెల్లూరుకు చెందిన లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంక్ సాధించారు. ఇక, హైదరాబాద్ విద్యార్థి సాయి దుర్గారెడ్డి.. ఆరో ర్యాంక్, అమలాపురం విద్యార్థి సాయినాథ్ శ్రీమంత.. పదో ర్యాంకు సాధించి సత్తా చాటారు.
ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష 2023ని ఎన్టీఏ ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించింది. తాజాగా ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి ఫలితాలను https://jeemain.nta.nic.in/లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక, జేఈఈ మెయిన్ సెషన్-1 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ నెల 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.