కుట్ర చేసి చంపారు: ధర్మెగౌడ ఆత్మహత్యపై కుమారస్వామి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 29, 2020, 09:09 PM IST
కుట్ర చేసి చంపారు: ధర్మెగౌడ ఆత్మహత్యపై కుమారస్వామి వ్యాఖ్యలు

సారాంశం

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్య వ్యవహారం కన్నడ నాట కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ ఆత్మహత్య వ్యవహారం కన్నడ నాట కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అని, వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి, దర్యాప్తు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఇటీవల విధాన పరిషత్‌లో జరిగిన ఘటనలు ధర్మెగౌడను కలవరపరిచాయని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కుట్ర చేసి, ధర్మెగౌడను హత్య చేశారని ఆయన ఆరోపించారు.

గౌడను ఛైర్మన్ సీటు నుంచి కిందికి లాక్కెళ్లి, అవమానించారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసింది తప్పో, ఒప్పో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్‌ సభ్యులకు చురకలంటించారు.

కాగా, డిసెంబర్ 15న జరిగిన కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే చంద్రప్రతాప్‌ శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలకు దిగారు.

అంతటితో ఆగకుండా ఛైర్మన్ స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు సభాపతి సీటు నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ఈ  క్రమంలో మంగళవారం రైల్వే ట్రాక్ పక్కన ధర్మెగౌడ శవమై కనిపించారు. ఆయన రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మరణంపై రాజకీయ పక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !