జయలలిత మృతి విషయంలో శశికళ విచారణకు కమిషన్ సిఫార్సు.. స్టాలిన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుందంటే..

By Sumanth KanukulaFirst Published Aug 30, 2022, 10:57 AM IST
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆరుముగస్వామి కమిషన్ చేసిన సిఫార్సులపై  చర్చించిన సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రివర్గం.. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులు మరోసారి తెరమీదకు వచ్చాయి. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికను సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచారు. ఆ నివేదికలో.. జయలలిత శశికళ సన్నిహితురాలు వీకే శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావులతో పాటు తదితరులపై ప్రభుత్వ విచారణకు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సిఫార్సు చేసింది. 

ఆరుముగస్వామి కమిషన్ చేసిన సిఫార్సులపై  చర్చించిన సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రివర్గం.. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తర్వాత తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదికతో పాటు  జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదికను శాసనసభ ముందుంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక, ఏడాది చివరికల్లా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 

ఇక, జయలలిత మరణం తర్వాత వెలువడ్డ అనేక అనుమానాల నేపథ్యంలో మాజీ సీఎం ఓ పనీర్‌సెల్వం ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి కారణంగా జయలలిత మరణాన్ని దర్యాప్తు చేయడానికి ఆరుముగస్వామి కమిషన్ ఏర్పడింది. 2017 నవంబర్‌లో ఈ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. జయలలితకు వైద్యం అందించిన వైద్యులు, అప్పటి అధికారులు, మంత్రులు, లీడర్లు, ఇతరుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకుంది. ఈ రిపోర్టును ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన జస్టిస్‌ ఆరుముగస్వామి.. 150 మంది సాక్షులను విచారించిన తర్వాత ఇంగ్లిష్‌లో 500 పేజీలు, తమిళంలో 600 పేజీల నివేదికను సిద్ధం చేశామన్నారు. నివేదికను ప్రచురించడంపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని, సంబంధిత అన్ని అంశాలను నివేదికలో పేర్కొన్నట్లుగా చెప్పారు. 

Also Read: జయలలిత కేసులో కీలక పురోగతి.. ‘హాస్పిటల్ అందించిన చికిత్సలో తప్పిదాలు లేవు’

ఇదిలా ఉంటే.. జయలలిత మృతిపై విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో.. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నందున తాను అధికారంలోకి రాగానే డీఎంకే ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇక, అనారోగ్య కారణాలతో 75 రోజులు ఆస్పత్రిలో ఉన్న జయలలిత 2016 డిసెంబర్ 5న మరణించారు. జయలలిత అనారోగ్యం బారినపడినప్పటి నుంచి ఆమె తుదిశ్వాస విడిచేవరకు చోటుచేసుకున్న పరిణామాలపై తమిళ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. 

click me!