అమర్ సింగ్ తో నా రిలేషన్ ఇదీ: జయప్రద

By pratap reddyFirst Published Feb 2, 2019, 7:18 AM IST
Highlights


తాను అమర్‌సింగ్‌కు రాఖీ కట్టినా జనం తమకు తోచినట్టు మాట్లాడుకుంటుంటారని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న క్వీన్స్‌లైన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు. 

ముంబై: ఎస్పీ మాజీ నేత అమర్‌సింగ్‌తో తన సంబంధంపై ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద మరోసారి స్పష్టత ఇచ్చారు. అమర్‌సింగ్‌ను తన గాడ్‌ఫాదర్‌ అని ఆమె అన్నారు. 

తాను అమర్‌సింగ్‌కు రాఖీ కట్టినా జనం తమకు తోచినట్టు మాట్లాడుకుంటుంటారని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న క్వీన్స్‌లైన్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు.  అమర్‌ సింగ్‌తో తనకున్న రాజకీయ అనుబంఽధాన్ని, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో తన ప్రత్యర్థి, ఎస్పీ సీనియర్‌ నేత అజమ్‌ ఖాన్‌ వల్ల తాను పడిన బాధలను ఆమె వివరించారు. 

తన అభివృద్ధికి చాలామంది సహకరించారని, వారిలో అమర్‌ సింగ్‌ను గాడ్‌ఫాదర్‌లా భావిస్తానని చెప్పారు. అజమ్‌ ఖాన్‌తో జరిపిన పోరాటంలో, ఒక దశలో తనపై యాసిడ్‌ దాడికి కూడా ఆయన ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో అల్లరి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు తెలిపారు. 

ఆ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న తనకు, అధినేత ములాయం సింగ్‌ సహా ఏ ఒక్క నాయకుడు కూడా తనపట్ల కనీసం సానుభూతి చూపించలేదని, అప్పుడు అమర్‌ సింగ్‌ డయాలసిస్‌ చేయించుకుంటూ దూరంగా ఉన్నారని ఆమె చెప్పారు. 

ఆస్పత్రి నుంచి తిరిగి రాగానే అమర్‌ సింగ్‌ తనను కలిసి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. పురుషాధిపత్య రాజకీయాల్లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే యుద్ధమే చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

click me!