భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాదని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ్ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొలి ప్రధాని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అని పేర్కొన్నారు.
చెన్నై: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాదని అన్నారు. ఇటీవల ఆయన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రి కాదు, సుభాశ్ చంద్రబోస్ తొలి ప్రధాని’ అని అన్నారు. బ్రిటీష్‌వారిలో సుభాశ్ చంద్రబోస్ భయాన్ని నింపారని, అందుకే వారు ఇండియాను వదిలివెళ్లిపోయారని చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి బాసనగౌడ పాటిల్ యత్నాల్ మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ ఓ పుస్తకంలో ఇలా రాశారు. మనకు స్వాతంత్ర్యం నిరాహార దీక్షలు చేసినందుకు రాలేదని, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపినందుకు రాలేదని వివరించారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ బ్రిటీష్ వారిలో భయాన్ని నింపారు కాబట్టే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని రాశారు’ అని వివరించారు.
‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు స్వేచ్ఛను ప్రకటించినప్పుడు స్వతంత్ర భారత్‌కు తొలి ప్రధానమంత్రిగా సుభాశ్ చంద్రబోస్ ఉన్నారు. ఈ స్వతంత్ర ప్రాంతాలు వాటికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయ గీతాన్ని కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకే నెహ్రూ మన దేశ తొలి ప్రధాని కాదని, నేతాజీ సుభాశ్ చంద్రబోసే తొలి ప్రధాని అని అంటుంటారు’ పాటిల్ యత్నాల్ వివరించారు.
Also Read: 2024 ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పరుస్తాం.. బీజేపీ చీఫ్‌ను తొలగించాలని కోరలేదు: ఏఐఏడీఎంకే సంచలనం
బాసనగౌడ పాటిల్ యత్నాల్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరేడు నెలల్లో కూలిపోతుందని ఆగస్టు నెలలో కామెంట్ చేశారు.