
లక్నో: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ అట్టుడికింది. ప్రయాగ్‌రాజ్, సహరన్‌పుర్ సహా మరికొన్ని నగరాల్లో ఆందోళనలు చెలరేగాయి. హింసాత్మకంగానూ మారాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పలు హెచ్చరికలు చేశారు. గత కొన్ని రోజులుగా పలు నగరాల్లో శాంతియుత వాతారణాన్ని చెడగొడుతున్న విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ నేపథ్యంలోనే హింసాత్మక ఘర్షణలకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న జావేద్ అమ్మద్ నివాసాన్ని కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘర్షణలకు మాస్టర్ మైండ్‌గా వెల్ఫేర్ పార్టీ నేత జావేద్ అహ్మద్ అని యూపీ పోలీసులు నిన్న అభిప్రాయపడ్డారు. జావేద్ అహ్మద్‌ను అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రయాగ్ రాజ్ ఘర్షణలకు మాస్టర్ మైండ్ అని ప్రకటించిన మరుసటి రోజే ఆయన నివాసాన్ని ప్రయాగ్ రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ కూల్చివేసింది.
జావేద్ అహ్మద్ నివాసాన్ని అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ ప్రయాగ్ రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) ఓ నోటీసు ఇచ్చింది. నిన్న జావేద్ అహ్మద్ నివాసానికి ఈ నోటీసు అంటించింది. రేపు ఉదయం 11 గంటల కల్లా ఇల్లు ఖాళీ చేయాలని, ఈ ఇల్లు అక్రమంగా నిర్మించినందును కూల్చేస్తున్నట్టు ఆ నోటీసు పేర్కొంది.
అనుకున్నట్టుగానే ఈ రోజు ఆ కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కూల్చివేతకు ముందు పోలీసులు పెద్ద మొత్తంలో ఆ ఏరియాలో మోహరించారు. ఇప్పటి వరకు అయితే.. జావేద్ అహ్మద్ నివాసం ముందు ఉన్న గేటును కూల్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ఏజెన్సీ ట్వీట్ చేసింది.
నిన్న కూడా సహరన్‌పూర్ అల్లర్లలో ప్రమేయం ఉందని చెబుతూ ఇద్దరు నిందితుల నివాసాలను అధికారులు కూల్చేశారు. వారు అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారని నిర్ధారించుకుంటున్న ప్రభుత్వం వారి ఆస్తులను శనివారం కూల్చివేసింది.
శుక్రవారం ప్రార్థనల తరువాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక హింస, నినాదాలు, రాళ్ళు రువ్విన ఘటనలు జరిగాయి. నూపుర్ శర్మ ప్రకటనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.ఇది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ప్రయాగ్ రాజ్ లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఓ వర్గం నిరసనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు, ఆస్తులను ధ్వంసం చేశారు. రహదారులను దిగ్బంధించారు. కాగా ఇటీవల యూపీలోని కాన్పూర్ లో జరిగిన మత ఘర్షణలో కూడా పోలీసులు 1500 మందిపై కేసులు నమోదు చేశారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై చేపట్టిన నిరసనలే ఈ ఉద్రికత్తలకు కారణం అయ్యాయి.