
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే ఉంటున్నది. ఘర్షణలు లేకున్నా.. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఆ బార్డర్‌లో పోస్టింగ్ అంటే జవాన్లు చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఈ సరిహద్దులో ఓ భారత జవాన్ మిస్ అయ్యారు. ఇప్పటికి 15 రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ విషయమై ఆ జవాను కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన 34 ఏళ్ల ప్రకాశ్ సింగ్ రాణా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలోని 7 గర్హవాల్ రైఫిల్స్‌లో ఉన్నారు. ఆయన ఇండియా చైనా బార్డర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని బార్డర్ పోస్టులో బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ఆయన అదృశ్యం అయ్యాడని, ఆయన జాడ ఇంకా తెలియరాలేదని ప్రకాశ్ సింగ్ రాణా భార్య మమతా రాణా అన్నారు.
తాము చివరగా మే 27వ తేదీన ఆయనతో మాట్లాడామని మమతా రాణా తెలిపారు. 28వ తేదీన తాను బాగే ఉన్నానని ఓ మెసేజీ పంపాడని వివరించారు. ఆ తర్వాతి రోజే బెటాలియన్ సుబేదార్ మేజర్ తనకు ఫోన్ చేశాడని, తన భర్త సహా మరొకరు కనిపించట్లేదని చెప్పాడని పేర్కొన్నారు. ఇండియా చైనా బార్డర్ పోస్టు నుంచి వీరిద్దరూ మిస్ అయ్యారని చెప్పాడని వివరించారు. అప్పటి నుంచి అంటే మే 29వ తేదీ నుంచి తనకు పలువురు సీనియర్ అధికారులు ఫోన్లు చేసి మాట్లాడారని, కానీ, ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం కనిపించలేదని తెలిపారు.
తన కూతురు, కొడుకు తరచూ తండ్రి గురించి అడుగుతున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదని మమతా రాణా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రకాశ్ సింగ్ రాణా, మమతా రాణాలకు ఇద్దరు పిల్లలు. పదేళ్ల బాబు ఏడో తరగతి చదువుతుండగా, ఏడేళ్ల కూతురు రెండో తరగతి చదువుతున్నది.
ప్రకాశ్ సింగ్ రాణా చివరి సారి గతేడాది నవంబర్‌లో ఇంటికి వచ్చాడు. రెండు నెలల పాటు కుటుంబంతో గడిపాడు. ఆ తర్వాత పోస్టింగ్ కోసం జనవరి 23న ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిపోయాడు.
ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే సహదేవ్ పుంధీర్ ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఫోకస్ పెట్టేలా తాను ప్రయత్నిస్తానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ విషయంపై పుంధీర్ రాష్ట్ర క్యాబినెట్‌తో కలిసి మాట్లాడారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ముందూ ఈ సమస్యను లేవనెత్తారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి, ఆర్మీకి ఈ విషయంపై అవగాహన ఉన్నదని, జవాన్‌ను వెతకడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానిక అధికారులతో జవాన్‌ను కనుక్కోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.