Dream 11: బంపర్ ఆఫర్.. కన్ను మూసి తెరిచేలోపు అకౌంట్‌లో రూ. 2 కోట్లు.. ఆనందంలో మునిగితేలుతున్న కశ్మీరీ

Published : May 23, 2022, 07:04 PM IST
Dream 11: బంపర్ ఆఫర్.. కన్ను మూసి తెరిచేలోపు అకౌంట్‌లో రూ. 2 కోట్లు.. ఆనందంలో మునిగితేలుతున్న కశ్మీరీ

సారాంశం

జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. డ్రీమ్ 11లో బెట్టింగ్ పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. రెండేళ్లుగా డ్రీమ్ 11లో ఫాంటసీ క్రికెట్ టీమ్‌లు క్రియేట్ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కానీ, తాజాగా, ఆయన క్రియేట్ చేసిన టీమ్ నెంబర్ వన్ స్థానానికి వెళ్లింది. దీంతో ఆయనకు రూ. 2 కోట్లు వచ్చాయి.  

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ డ్రీమ్ 11 విశేష ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. చాలా మంది క్రికెట్ ప్రేమికుల మొబైల్ ఫోన్‌లలో ఈ డ్రీమ్ 11 కనిపించడం సర్వ సాధారణం. చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ యాప్ డ్రీమ్ 11‌లో తమ ఐపీఎల్ జట్లు సృష్టించి ఆసక్తిగా చూస్తుంటారు. ఇలాగే జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు డ్రీమ్ 11 యాప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అదృష్టం తన వెంటే వచ్చింది. ఆయన కన్నుమూసి తెరిచే లోపు తన అకౌంట్‌లో రూ. 2 కోట్లు జమ అయ్యాయి.

దక్షిణ కశ్మీర్‌ జిల్లా అనంత్‌నాగ్‌కు చెందిన వసీం రాజా రెండేళ్లుగా డ్రీమ్ 11లో క్రికెట్, హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ గేమ్‌లలో బెట్టింగ్ వేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అతను క్రికెట్‌లో తన ఫాంటసీ టీమ్ సెలెక్ట్ చేసుకుని బెట్టింగ్ వేశాడు. ఆయనకు అదృష్టం వరించింది. ఏకంగా రూ. 2 కోట్లు తగిలాయి.

దీనిపై వసీం రాజా సహా ఆయన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తాను డ్రీమ్ 11లో జట్టు ఎంపిక చేసి పెట్టినట్టు వసీం రాజా చెప్పాడు. అయితే, శనివారం రాత్రి ఎప్పటిలాగే డ్రీమ్ 11 యాప్ చూసుకుంటూ నిద్రపోయాడని వివరించాడు. తాను నిద్రలోకి జారుకున్న తర్వాత ఓ ఫ్రెండ్ తనకు ఫోన్ చేశాడని పేర్కొన్నాడు. తాను డ్రీమ్ 11లో పెట్టిన జట్టే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టు తనకు చెప్పాడని అన్నాడు. దీంతో వెంటనే తాను నిద్ర లేచి చూడగా తాను రూ. 2 కోట్లు గెలుచుకున్నట్టు ఉన్నదని వివరించాడు. రెండేళ్లుగా తాను ఐపీఎల్‌లో ఫాంటసీ టీమ్‌లను క్రియేట్ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని పేర్కొన్నాడు. అయితే, ఆ రోజు మాత్రం అదృష్టం తనను వరించిందని, రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని అయ్యానని ఆనందోత్సాహాలతో చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో ఆయన తన కుటుంబ నేపథ్యాన్ని కూడా పేర్కొన్నాడు. తమది పేద కుటుంబం అని, ఆర్థిక వెనుకబాటు ఎక్కువగా ఉన్నదని వివరించాడు. ఈ డబ్బు తమ సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆమెకు వెంటనే చికిత్స చేయిస్తానని పేర్కొనడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..