
CM Nitish Kumar : గత కొంత కాలంగా దేశంలో కులప్రాతిపదికన జనాభా లెక్కలు నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కులాల వారీగా జనగణనకు దేశంలోని చాలా రాష్ట్రాలు, వివిధ రాజకీయ పార్టీలు అనుకూలంగా స్పందిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలు సైతం ఈ తరహా డిమాండ్లు చేస్తున్నాయి. ఈ విషయంలో బీహార్ కాస్తా ముందుందనే చెప్పాలి. ఎందుకంటే.. కులాల వారీగా జనాభా లెక్కల డిమాండ్‌తో బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఇదివరకు ప్రధాని మోడీని కూడా కలిశారు. బీహార్‌కులోని ఇతర పార్టీల నేతలు సైతం కుల గణనకు జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీశ్ కుమార్ మే 27న కుల ఆధారిత జనాభా లెక్కలపై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. కుల గణనపై అఖిలపక్ష సమావేశం గురించి తనకు సమాచారం అందిందని మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ తెలిపారు.
"మేము మే 27న కుల ఆధారిత జనాభా లెక్కల అంశానికి సంబంధించిన సమావేశానికి అన్ని పార్టీలకు ప్రతిపాదనను పంపాము. అయితే, కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ పిలుపుకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం" అని నితీశ్ కుమార్ అన్నారు. "కుల ఆధారిత జనాభా గణనకు సంబంధించిన ప్రతి అంశాన్ని మేము చర్చించాలనుకుంటున్నాము. వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ సలహాలను అందజేస్తారని, ఇది చాలా సహాయకారిగా ఉంటుందని" ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ని కలిసిన 10 రోజుల తర్వాత నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారు. మే 27న జరిగే సమావేశానికి సీఎంవో కార్యాలయం నుంచి తనకు కాల్ వచ్చిందని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు. నితీష్ కుమార్ ఈ ప్రకటనతో బీహార్‌లో కుల ప్రాతిపదికన జనాభా గణన త్వరలో జరిగే అవకాశం ఉందని, దాని ఖర్చులను బీహార్ ప్రభుత్వమే భరిస్తుందనే విషయం స్పష్టమైంది.
బీహార్‌లో జేడీ-యూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఏఐఎంఐఎం వంటి పార్టీలు కుల గణనకు అనుకూలంగా ఉన్నాయి. అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ హాజరయ్యే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "కుల ఆధారిత జనాభా గణన కోసం సమావేశం తేదీ గురించి ముఖ్యమంత్రి మాకు చెప్పారు. ఈ విషయంపై పార్టీ (బీజేపీ)లో చర్చిస్తున్నాం. మేము త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని చెప్పారు. కుల ప్రాతిపదికన జనాభా గణన అనేది బీజేపీని మినహాయించాల్సిన రాజకీయ పార్టీల చిరకాల డిమాండ్. నితీష్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ఎనిమిది నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసింది. అయితే దానిపై వాస్తవ పురోగతి క్షేత్రస్థాయిలో కనిపించలేదు. గత నెల రోజులుగా, పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.. నితీష్ కుమార్ తన నిర్ణయంపై గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది.