ఎన్నికల సంఘంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ ఫైర్.. స్థానిక ఎన్నికలు వద్దు, లోక్ సభ ఎన్నికలు ముద్దు?

By Mahesh K  |  First Published Oct 10, 2023, 1:12 PM IST

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహించారు. ఇతర రాష్ట్రాల్లాగే జమ్ము కశ్మీర్‌కు ఎన్నికల హక్కులు లేవా? అని ప్రశ్నించారు. ఇక్కడ వచ్చే నెల జరగాల్సి ఉన్న పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలను నిర్వహించే సాహసం చేయని బీజేపీ, ఆ పార్టీ అవసరాల కోసం లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నదని ఫైర్ అయ్యారు.
 


న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ ఐదు రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వస్తున్న జమ్ము కశ్మీర్ ఎలక్షన్ గురించి ప్రకటన లేదు. అదే విలేకరుల సమావేశంలో జమ్ము కశ్మీర్ ఎన్నికలను వాయిదా వేయడానికి కారణాలేమిటీ? అని ప్రశ్నించగా రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా మారినప్పుడు భద్రతా పరమైన అంశాలు, ఇతర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ డెసిషన్ తీసుకుంటామని సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈసీపై మండిపడ్డారు.

జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి 2018 నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. కార్గిల్ స్థానిక ఎన్నికల్లో ఇండియా  కూటమిని బీజేపీని చిత్తుగా ఓడించింది. బీజేపీ విధానాలను కశ్మీరీలు ఆదరిస్తున్నారని ఒకవైపు చెబుతున్నా ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయాన్ని బీజేపీ మూటగట్టుకుంది. ఈ సందర్భంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. గెలుపు, ఓటముల పట్టకం ద్వారా మాత్రమే చూసే రాజకీయపార్టీ బీజేపీపై తనకేమీ ఫిర్యాదులు లేవని, కానీ, తన ఫిర్యాదులు ఎన్నికల సంఘంపైనే అని అన్నారు.

Latest Videos

ఈ రోజు కూడా కశ్మీర్‌లో ఎన్నికల గురించి ప్రశ్నించగా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వడం బాధాకరం అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఆ అంశాలేమిటీ? అని ప్రశ్నించారు. అది భయపెట్టే అంశమే అయివుంటుందని, అది బీజేపీ భయపెట్టే అంశమే అయివుంటుందని వివరించారు. ఇప్పటి వరకు బీజేపీ రాజ్ భవన్ వెనుక దాక్కుందని, ఇప్పుడు ఎన్నికల కమిషనర్ వెనుక దాక్కుంటున్నదని తెలిపారు.

Also Read: జమ్ముకశ్మీర్‌‌లో ఎన్నికలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఏం చెప్పిందంటే..

ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయం తీసుకోకుండా, కేవలం బీజేపీ మార్గదర్శకత్వంలోనే నిర్ణయం తీసుకుంటున్నదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. లేదంటే జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలేమీ లేవని వివరించారు. వచ్చే నెలలో జరగాల్సిన జమ్ము కశ్మీర్ పంచాయతీ, పట్టణ పాలక మండలి ఎన్నికలను నిర్వహించే సాహసం చేయని బీజేపీ.. పార్లమెంటు ఎన్నికలను మాత్రం ఆ పార్టీ అవసరానికి నిర్వహించాలని చూస్తున్నదని విమర్శించారు.

ఎన్నికలు నిర్వహించలేనంతగా జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు దిగజారిపోయాయా? దీనికి సమాధానాన్ని తాను ఎన్నికల కమిషనర్ నుంచి వినాలని అనుకుంటున్నట్టు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘ఒక వేళ నిజంగానే దిగజారిపోతే మాకు చెప్పండి. ఇప్పటి వరకు 2019 నుంచి జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయనే చెబుతున్నారు. కోట్లాది మంది పర్యాటకులు కశ్మీర్‌కు వస్తున్నారని అంటున్నారు. అవన్నీ వాస్తవాలే అయితే మీరు ఎదురుచూస్తున్నా ఆ అంశాలేమిటో తెలియపరచండి’ అంటూ అబ్దుల్లా ఫైర్ అయ్యారు.

కశ్మీరీ ప్రజల హక్కలను కాలరాస్తున్నారని, ఎన్నికలు వారి హక్కు అని, ఇతర రాష్ట్రాలకు ఉన్న హక్కులు తమకు లేవా? అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఏ అంశాలను, ఏ కారణాలను సాకుగా చూపి తమకు ఎన్నికల హక్కును నిరాకరిస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. 

click me!