
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. షోపియాన్‌లోని కప్రీన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. హతమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడైన కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్‌గా గుర్తించామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. అతడు కుల్గామ్-షోపియాన్ ప్రాంతంలో చురుగ్గా పనిచేసే వ్యక్తి అని భద్రత బలగాలు తెలిపాయి.
షోపియాన్‌లోని కప్రీన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాల జాయింట్ గా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని తెలిపారు. అక్టోబరులో కాశ్మీరీ పండిట్ పురాన్ కృష్ణ భట్ అనే స్థానికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపిన ప్రదేశం ఇదేనని తెలిపారు.సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు.
అంతకుముందు నవంబర్ 1న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా, అనంతనాగ్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదయ్యాయి. ఈ రెండు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
ఉగ్రవాద నిధులపై చర్యలు
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిధులు, ఉగ్రవాద యంత్రాంగంపై చర్యలు కొనసాగుతున్నాయి. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) గుర్తించిన తరువాత, షోపియాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించిన కనీసం తొమ్మిది ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఏ సిఫారసు మేరకు డీఎం షోపియాన్ నోటిఫై చేయడంతో జిల్లాలో తొమ్మిది చోట్ల రెండు కోట్లకు పైగా ఆస్తులను సీల్ చేశారు.