
సక్సెస్ ను పొందడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదన్న వాస్తవాన్ని నిరూపిస్తున్నారు నేడు ఎంతోమంది. ఇలాంటి వారే ఎన్ని ఒడిదుడుకులెదురైనా లోకం గర్వించే స్థాయికి వెళతారు. ఇలాంటి వారిలో నవ్ నూర్ కౌర్ ఒకరు. ఇంతకీ ఏమో ఎవరో తెలియదా? ఎలాంటి అనుభవం లేని ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది ఈ మహిళ. మరి ఆమె చేసే వ్యాపారం ఏంటి? ఆమె ఎంత సంపాధిస్తోంది? ఆమె వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన ఐఎంటీ ఘజియాబాద్ లో నవ్ నూన్ కౌర్ 2019లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువైపోయాక ఈమెకు ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకులో జాబ్ వచ్చింది. మంచి వేతనం కూడాను. అయితే ఆ ఉద్యోగం చేస్తూనే.. తన పొదుపుతో ఇంటి నుంచి పార్ట్ టైమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. రెండేళ్లలోనే ఆ వ్యాపారం ఎంతో లాభదాయకంగా మారింది. ఇంకేముందు తన బ్యాంక్ జాబ్ ను వదిలేసింది. ఇక తన సమయాన్నంతా స్టార్టప్ కే కేటాయించింది.
తన సొంత సంపాదనతో వ్యాపారాన్ని ప్రారంభించింది నవ్ నూత్ కౌర్. రోజంతా ఆఫీసులో పని చేస్తూ.. రాత్రి పూట తన స్టార్టప్ ప్రాజెక్టులో పని చేసేది. అయితే ఆమె స్టార్టప్ కోసం ఉద్యోగాన్ని మానేయడం వాళ్ల కుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఆమె ఆ బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అందరికీ నమ్మకం కలిగించింది. అందరి సహకారంతోనే బెల్లం ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించింది. ఈ వ్యాపారం పెట్టిన మొదట్లో ఈమెకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ రానురాను ఈ వ్యాపారం మంచి లాభాదాయకంగా మారింది. గత ఏడాది ఈమె కంపెనీ జాగర్ కేన్ ఏకంగా రూ.2 కోట్ల టర్నోవర్ ను సాధించింది. వచ్చే ఐదేండ్లలో రూ.100 కోట్ల టర్నోవరే లక్ష్యంగా పెట్టుకుంది ఈమె.
మీకు తెలుసా? వీళ్ల కుటుంబంలో ఈమే మొదటి పారిశ్రామిక వేత్త. ఎలాంటి అనుభవం లేకున్నా... చాకచక్యంగా తన వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తోంది. ఈమె వ్యాపారం భారతదేశంలో 22 జిల్లాలకు విస్తరించింది. నవ్ నూత్ కౌర్ లూథియానాలో చదివింది. వీళ్ల నాన్న ఒక ప్రొఫెసర్, అమ్మ స్కూల్ ప్రిన్సిపాల్. ఎంబీఏ తర్వాత ఆమెను ఐఎంటీ ఘజియాబాద్ కు ఎంపిక చేశారు. ఈమె బాగా చదివేది. చదువు అయిపోగానే ఈమె గుర్గావ్ లోని కోటక్ బ్యాంకులో జాబ్ చేసింది. మంచి జీతం కూడా వచ్చేది. కానీ ఆమెకు ఎప్పటినుంచో ఫుడ్ వ్యాపారాన్ని పెట్టాలనే కల ఉండేది.
అయితే తన కుటుంబ సభ్యుల్లో చాలా మందికి మధుమేహం ఉంది. వీరు చక్కెరకు బదులుగా బెల్లాన్నే తినాలి. కాబట్టి ఈమెకు బెల్లం అమ్మాలనే ఆలోచన వచ్చిందట. శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన వాటిని కనుక్కునే ప్రయత్నం చేసింది. ఇంకేంముంది ఆమె బెల్లంతో ఎన్నో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసింది. ఎన్నో స్వచ్ఛమైన ఉత్పత్తులను తయారు చేసింది. ఈమె డోర్ టూ డోర్ మార్కెటింగ్ కూడా చేసింది. వీటి టేస్ట్ నచ్చడంతో జనాలు వీటినే కొనడం మొదలుపెట్టారు. ఇంకేంది తన ఉత్పత్తిపై ఆమెకు ఎనలేని నమ్మకం కలిగింది.
పంజాబ్ లో బెల్లం తయారీ ప్లాంట్ నడుపుతున్న వాళ్ల నాన్న విద్యార్థి కౌశల్ తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఇతను తయారీని పర్యవేక్షిస్తాడు. నవ్ నూత్ కౌర్ బ్రాండింగ్, కార్యకలాపాలు, ఒప్పందాలు వంటి విషయాలను చూసుకుంటుంది. ఈమె రూ.5 లక్షలు వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టింది.ఈ వ్యాపారంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినా ఎక్కుడా తగ్గలేదు. అయితే మొదట్లో చాలా మంది దుకాణదారులు తక్కువ మార్జిన్లు, తక్కువ షెల్ఫ్ లైఫ్ కారణంగా ఆమె ప్రొడక్ట్ లను కొనేవారు కాదు. ఇదికొంత నిరాశ కలిగించినా.. ఆమె తన పట్టుదలను కోల్పోలేదు. తన ప్రొడక్ట్ ల షెల్ఫ్ లైఫ్ ను 1 నెల నుంచి 9 నెలలకు పెంచారు. ఈమె ఉత్పత్తులు కేవలం మన దేశానికే పరిమితం కాలే. ఇతర దేశాలకు కూడా ఇవి ఎగుమతి అవుతున్నాయి. ఈ సంస్థలో 25 మంది పనిచేస్తుంది. వీరిలో ఏడుగురు ఆడవారు పనిచేస్తున్నారు.