
మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కలకలం రేపుతున్నాయి. శివసేన నేతలు, మహారాష్ట్ర మంత్రులు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరాబ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల ఈ దాడులు జరిగాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న శివసేన ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు రాహుల్ కనాల్ (Rahul Kanal) ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ విలేకరుల సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ దాడులు జరిగాయి.
మహారాష్ట్రలోని 12 ప్రదేశాలలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. రాహుల్, కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మతేతో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఈ దాడులు జరిగాయి. సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మతేలకు శివసేన మంత్రి అనిల్ పరబ్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
‘మహారాష్ట్రపై ఇలాంటి దాడులు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి’ అని ఆదిత్య ఠాక్రే ఒక ప్రకటనలో తెలిపారు. ‘గతంలో కేంద్ర ఏజెన్సీలు ఇలాగే దుర్వినియోగం అయ్యాయి.. బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాగే జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఈ కేంద్ర ఏజెన్సీలు బీజేపీకి ఒక విధంగా ప్రచార యంత్రాంగంగా మారాయి. కానీ మేం తలవంచము.. మహారాష్ట్ర తలవంచదు’ అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.
ఇక, అంతకు ముందు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కాంటాక్టర్లు, శివసేన నాయకులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఐటీ దాడులపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన కొందరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో ఎవరు లేరా..? అని అడిగారు. ఇదంతా మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అస్థిపరిచే వ్యుహం అని ఆరోపించారు. ముంబై పోలీసులు క్రిమినల్ సిండికేట్, దోపిడీ రాకెట్ ED అధికారుల లింక్‌లపై ముంబై పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తారని చెప్పారు. ఈడీ అధికారులలో కొందరు జైలుకు కూడా వెళతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాటలను గుర్తుపెట్టుకోండి అని చెప్పారు.