అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాన్ని చూసి ప్రపంచం గర్విస్తోంది: ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్  

By Rajesh KarampooriFirst Published Sep 26, 2022, 6:35 AM IST
Highlights

అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాన్ని చూసి ప్రపంచం గర్విస్తోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. గత 60 ఏళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ అత్యున్నత స్తానంలో నిలిచిందని, ఈ రంగంలో మ‌న దేశం స్ఫూర్తిదాయకమైన స్థానంలో ఉంద‌ని అన్నారు. 

అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాన్ని చూసి ప్రపంచం గర్విస్తోందని, గత 60 ఏళ్లలో మ‌న‌దేశం ఉన్న‌త స్థానంలో నిలిచింద‌ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆదివారం కట్టంకులత్తూర్‌లోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. స్పేస్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లను తీసుకురావడం, సహాయం చేయడం ద్వారా ఈ రంగంలో పెద్ద మార్పును చూస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు. అదే సమయంలో రాకెట్లు, ఉపగ్రహాలను అభివృద్ధి చేసేందుకు అత్యుత్తమ అప్లికేషన్లను కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా చూస్తోందని, అంతరిక్షంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.  

తాము ఎప్పుడూ ఇతరుల సామర్థ్యాలను నమ్ముతామనీ, కాని మ‌న  దేశంలో రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేయగలమని ఇతరులు ఎప్పుడూ నమ్మలేదనీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా.. సొంత‌ సామర్థ్యాన్ని ఉపయోగించి ఉపగ్రహాలను తయారు చేస్తున్నామ‌నీ,  స్వదేశీ సాంకేతికతతో రాకెట్ల‌ను అభివృద్ధి చేసి..  అంతరిక్షంలోకి పంపడం ద్వారా మ‌న శ‌క్తి ఎంటో ప్ర‌పంచ దేశాల‌ను అర్థ‌మైంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం మూడు రాకెట్లు ప్ర‌యోగానికి  సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

రాబోయే 25 సంవత్సరాలకు బ్లూప్రింట్  సిద్ధం  

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రానున్న 25 ఏళ్లలో దేశం ఏం సాధించాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన విజన్ ఉందని, ఆ 25 ఏళ్లలో దేశం ప్ర‌తి రంగంలో ఘ‌న‌నీయ‌మైన అభివృద్ది సాధిస్తుంద‌ని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రజల అసలైన కృషి ద్వారానే ఒక దేశం యొక్క నిజమైన శక్తి బయటకు వస్తుందని, వాస్తవానికి మనం ఈ దేశంలో ఆ సామర్థ్యాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు.

అంత‌రిక్ష రంగంలో భార‌త్ అగ్రరాజ్యంగా ఎదగడానికి అవ‌కాశ‌ముంద‌ని,  సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని సోమనాథ్ అన్నారు. 

ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి ఒకరితో ఒకరు పోటీప‌డి జీవించాల‌ని,  ప్రతి ఒక్కరూ జ్ఞానం, నైపుణ్యాల పరంగా ప్రపంచం మొత్తానికి తోడ్పడాలనీ. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావాలని అన్నారు. 

click me!