
జాబిల్లిపై పరిశోధనల జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో చంద్రయాన్-3ను విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల, పరిశోధకుల నిర్విరామ కృషికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో ఓ బాలుడు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు అందజేసిన బహుమతి సోషల్ మీడియాలో నెటిజన్ల మనసును హత్తుకుంటుంది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి తీసుకువెళ్లిన విక్రమ్ ల్యాండర్ నమూనాను ఆ బాలుడు సూక్ష్మంగా రూపొందించాడు. దీనిని చేతితో తయారు చేశారు. అయితే పొరుగువారందరి తరఫున విక్రమ్ ల్యాండర్ నమూనాను ఆ బాలుడు ఇస్రో చీఫ్‌కి సమర్పించాడు.
ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)లో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ‘‘ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను ఈరోజు ఆశ్చర్యకరమైన సందర్శకుడు కలిశాడు. పొరుగున ఉండే ఒక చిన్న బాలుడు సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను పొరుగువారి అందరి తరపున ఇస్రో చీఫ్‌కి అందజేశాడు’’ అని పీవీ వెంకటకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.
దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ‘‘ఇది కొత్త తరాన్ని పెంపొందించడం, ప్రోత్సహించడం’’ అని పేర్కొన్నారు. మరో నెటిజన్ ‘‘ఇస్రో ప్రస్తుత, కాబోయే ఛైర్మన్ ఒకే ఫ్రేమ్‌లో’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక, చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటిన సంగతి తెలిసిందే. ఎస్ సోమనాథ్‌ను ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంలో ఇస్రో యొక్క తిరుగులేని నిబద్ధతకు తన ప్రశంసలను తెలియజేశారు.