గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) పేర్కొంది. పలు పూజా వస్తువులకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్టు, అందులో గంగాజలం కూడా ఉన్నట్టు స్పష్టం చేసింది.
పవిత్ర గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) స్పందించింది. దీనిపై కాంగ్రెజ్ జాతీయ అధ్యక్షుడు కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆ బోర్డు వివరణ ఇచ్చింది. గంగాజలం, ఇతర పూజా వస్తువులపై జీఎస్టీ విధించండం లేదని స్పష్టం చేసింది.
గంగాజలం, మతపరమైన పూజల్లో ఉపయోగించే ఇతర వస్తువులకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉందని గురువారం స్పష్టతనిచ్చింది. గంగాజలాన్ని దేశవ్యాప్తంగా ఇళ్లలో పూజల్లో ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
Clarification regarding certain media reports on applicability of GST on Gangajal. pic.twitter.com/t598ahN07x
— CBIC (@cbic_india)
‘‘దేశవ్యాప్తంగా ఇళ్లలో పూజల్లో ఉపయోగించే గంగాజలం, పూజా సామగ్రికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. 2017లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 14, 15వ సమావేశాల్లో పూజా సామగ్రిపై జీఎస్టీ గురించి సవివరంగా చర్చించి, వాటిని మినహాయింపు జాబితాలో ఉంచాలని నిర్ణయించారు. అందుకే జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వస్తువులన్నింటికీ మినహాయింపు అమల్లో ఉంది.’’ అని సీబీఐసీ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.
అలాగే పూజా వస్తువులైన కాజల్, కుంకుమ, బిందు, సింధూ, ఆల్టా, ప్లాస్టిక్ వంటి ఇతర సామగ్రిని జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 10.2 శాతం పెరిగి రూ .1.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది ఆగస్టులో వసూలు చేసిన దానికంటే 2.3 శాతం ఎక్కువగా ఉంది.
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ గంగాజలంపై జీఎస్టీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మోదీ గారూ.. ఒక సాధారణ భారతీయుడి పుట్టుక నుంచి జీవిత చరమాంకం వరకు మోక్షదాయిని అయిన గంగామాత ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజు ఉత్తరాఖండ్ లో ఉండటం మంచిదే, కానీ మీ ప్రభుత్వం పవిత్ర గంగా జలాలపై 18 శాతం జీఎస్టీని విధించింది. ఇంటి దగ్గరకి గంగా జలాలు (హోమ్ డెలివరీ) పొందే వారిపై ఈ భారం ఎంత ఉంటుందో ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. ఇది మీ ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి పరాకాష్ట.’’ అని ‘ఎక్స్’ (ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐసీ స్పందించి, వివరణ ఇచ్చింది.