
న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే పని మీద ఓ ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఇండియాకు బయల్దేరినట్టు తెలుస్తున్నది. ఆ టెర్రరిస్టు రష్యాలో పట్టుబడ్డాడు. ఈ మేరకు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఓ వీడియో విడుదల చేసింది. అందులోని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
భారత దేశానికి చెందిన ఓ లీడర్‌పై దాడి చేయడానికి ఓ ఐఎస్ టెర్రరిస్టు గ్రూపునకు చెందిన సూసైడ్ బాంబర్ కుట్ర చేశాడని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన స్పుత్నిక్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. మధ్య ఆసియా రీజియన్‌కు చెందిన ఓ వ్యక్తి ఐఎస్ టెర్రరిస్టు అని రష్యా ఎఫ్ఎస్‌బీ గుర్తించింది. ఆయన మధ్య ఆసియాకు చెందిన వాడని కనుగొంది. భారత దేశంలో అధికార పక్షానికి చెందిన ఓ లీడర్‌పై ఆత్మాహుతి దాడి చేయడానికి ఆ ఉగ్రవాది ప్లాన్ చేసుకున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆ సూసైడ్ బాంబర్‌ను ఐఎస్ఐఎస్ బహుశా ఇంటర్నెట్ ఆధారంగా రిక్రూట్ చేసుకుని ఉండొచ్చని తెలుస్తున్నది. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన ఘటనకు ప్రతీకారంగా ఆయనను ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్టు కథనాలు వివరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయనను రిక్రూట్ చేసుకున్న తర్వాత రష్యాకు ఆ ఉగ్రవాద సంస్థ పంపింది. అక్కడి నుంచి సదరు ఉగ్రవాది ఇండియాకు వెళ్లి విధ్వంసం సృష్టించాలి. అంటే.. ఓ లీడర్ లక్ష్యంగా ఆత్మాహుతికి పాల్పడాలి.
అయితే, రష్యాకు వెళ్లిన తర్వాత ఎఫ్ఎస్‌బీ ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. ఆ ఐఎస్ టెర్రరిస్టును విచారించగా.. తన కుట్రను అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. రష్యా నుంచి ఆయన భారత్‌కు వెళ్లగానే.. అక్కడ ఆత్మాహుతి దాడికి కావాల్సిన పరికరాలు, ఇతర అవసరాలను అక్కడ ఉన్న కొందరు అందించి తీరుస్తారని ఆ ఉగ్రవాది విచారణలో వెల్లడించారు.
2022లో తాను రష్యాకు వచ్చినట్టు ఆ ఉగ్రవాది ఓ వీడియోలో వెల్లడించారు. అక్కడి నుంచి ఇండియాకు వెళ్లాలని, ఇండియాలో తనకు కొందరు కలుస్తారని, వారే తాను ఉగ్రబీభత్సం సృష్టించడానికి కావాల్సిన వస్తువులను అందిస్తారని వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఆదేశాల మేరకు ముహమ్మద్ ప్రవక్త అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆమిర్‌కు అనుకూలంగా తాను ప్రతిజ్ఞ తీసుకున్నారని, ఆ తర్వాతే తాను రష్యాకు బయల్దేరినట్టు ఉగ్రవాది వివరించారు.