స్కూల్ పిల్లలతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థుల మృతి, 11 మందికి గాయాలు

By Sumanth KanukulaFirst Published Aug 22, 2022, 3:09 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్‌ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్‌ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. విద్యార్థులు నాగ్డాలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం సేకరించారు. వ్యాన్‌లో నుంచి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. గాయపడిన విద్యార్థులు వ్యాన్‌లో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ట్రక్కు రాంగ్‌ రూట్‌లో వచ్చి విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టినట్టుగా రిపోర్ట్ సూచిస్తున్నాయి.

ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యేంద్ర శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్హెల్ పట్టణంలోని ఝిర్నియా ఫాటా సమీపంలో ఉదయం 7 గంటలకు ప్రమాదం జరిగింది. విద్యార్థులు నాగ్డాలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు విద్యార్థులు మృతిచెందగా, 11 మంది గాయపడ్డారు. గాయపడిన విద్యార్థుల్లో ముగ్గురి పరస్థితి విషమంగా ఉండటంతో వారిని ఇండోర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణించిన విద్యార్థులు ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారే.  ట్రక్కు, వ్యాన్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యాన్ స్కూల్‌కు చెందినది కాదని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ వ్యాన్‌ను అద్దెకు తీసుకున్నారని చెప్పారు. ఇక, ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మాజీ సీఎం కమల్‌నాథ్‌ విచారం వ్యక్తం చేశారు.

click me!