కరెన్సీ నోట్లపై వినాయకుడి, లక్ష్మీ దేవి ఫొటోలను పెట్టాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By Sumanth KanukulaFirst Published Oct 26, 2022, 11:29 AM IST
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై వినాయకుడి, లక్ష్మీ దేవి ఫొటోలను పెట్టాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై వినాయకుడి, లక్ష్మీ దేవి ఫొటోలను పెట్టాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోందని అన్నారు. స్వాతంత్యక్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని చెప్పారు. భారతదేశాన్ని ధనిక దేశంగా మార్చేందుకు.. పాఠశాలలు, ఆసుపత్రులను పెద్ద సంఖ్యలో నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం చాలా ప్రయత్నం అవసరమని పేర్కొన్నారు. దేవతామూర్తుల అనుగ్రహం ఉన్నప్పుడే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పారు. 

కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రంతో పాటు గణేషుడి, లక్ష్మీ దేవి చిత్రాలను కూడా ఉంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఇండోనేషియా అనుసరిస్తున్న విధానాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్  ఉదాహరణగా ప్రస్తావించారు. “ఇండోనేషియాలో కరెన్సీ నోట్లకు ఒకవైపు గణేష్ బొమ్మ ఉంటుంది. ఇది ముస్లిం దేశం.. ఆ దేశంలో 85 శాతం కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు. వారు చేయగలిగితే.. మనం కూడా చేయగలము ” అని కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టుగా చెప్పారు. 

దీపావళి నాడు మనమందరం శ్రేయస్సు కోసం లక్ష్మీ దేవిని, వినాయకుడిని పూజిస్తామని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలే కాకుండా.. భగవంతుని ఆశీస్సులు కావాలని కేజ్రీవాల్ అన్నారు. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా లక్ష్మీ దేవి, వినాయకుడి చిత్రాలను ఉంచాలని ప్రధాన మంత్రికి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు. 

click me!